కరోనా నిర్ధారణలో ‘ర్యాపిడ్‌’ విప్లవం

26 Nov, 2020 19:12 IST|Sakshi

10 నిమిషాల్లో ఫలితం.. వెంటనే అప్రమత్తం

ఎక్కడికక్కడ వైరస్‌ వ్యాప్తి కట్టడికి యాంటీజెన్‌ టెస్టులు 

మన రాష్ట్రంలో సుమారు 38 శాతం టెస్టులు ఇవే

దేశ వ్యాప్తంగా ఆగస్ట్‌ నుంచి అందుబాటులోకి 

మొబైల్‌ టెస్టింగ్‌ అవకాశంతో కుగ్రామాల్లోనూ పరీక్షలు

మొదట్లో కిట్‌ ధర రూ.410.. తాజాగా రూ.272

ఇంటి వద్దకు వెళ్లి పరీక్షలు చేయడం ఏపీలో సక్సెస్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్‌లు కీలక భాగస్వామ్యం నెలకొల్పాయి. కొత్త వైరస్‌ కావడానికి తోడు, వ్యాప్తి అత్యంత వేగంగా ఉండటం వల్ల అపార నష్టం సంభవించింది. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్‌ నుంచి తక్షణమే బయట పడేందుకు ర్యాపిడ్‌ కిట్‌లు ఉపయోగపడిన తీరు అమోఘమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు డెంగీ జ్వరాలకు మాత్రమే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌లు వాడారు. ఇది పూర్తిగా దోమకాటు జ్వరాలకు వాడేది. కోవిడ్‌ సోకిన తొలి రోజుల్లో ర్యాపిడ్‌ కిట్‌లు అందుబాటులో లేవు. ఇవి బాగా అందుబాటులోకి వచ్చింది 2020 ఆగస్ట్‌ నుంచే. ఆ తర్వాతే కరోనా వ్యాప్తి తగ్గినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: వాటికి తొలి ప్రాధాన్యత: సీఎం జగన్‌)

తక్కువ సమయంలో ఫలితం 
కోవిడ్‌ వైరస్‌ను కనుగొనడంలో ఆర్టీపీసీఆర్‌ టెస్టును గోల్డెన్‌ స్టాండర్డ్‌ అని చెబుతారు. అయితే ఈ టెస్టు ఫలితం కనీసం 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లోకి వచ్చిన ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లు 10 నిమిషాల్లో అక్కడికక్కడే ఫలితం ఇచ్చాయి. పైగా సేకరించిన నమూనాలను ల్యాబ్‌లకు పంపాల్సిన అవసరం ఉండదు. పెద్దగా నైపుణ్యం కూడా అక్కర్లేదు. 
ఇంటి వద్దకే వెళ్లి పరీక్ష చేసే అవకాశం ఉండటం వల్ల మొత్తం టెస్టుల్లో 38 శాతం ర్యాపిడ్‌ టెస్టులే ఉన్నాయి. ఇంటివద్దకే వెళ్లి టెస్టులు చేయడంలో ఏపీలో అద్భుత ఫలితాలు వచ్చాయి. (చదవండి: విజృంభిస్తున్న కరోనా : రికార్డు పెళ్ళిళ్లు

వీలైనంత త్వరగా అప్రమత్తం
ఫలితం వెంటనే తేలడంతో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడే వీలు కలిగింది. సత్వరమే హోం ఐసొలేషన్‌, లేదా ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందించడానికి సాధ్యమైంది.
హై రిస్క్‌ ప్రాంతాలు లేదా హైరిస్క్‌ గ్రూపులో ఉన్న వారిని గుర్తించడంలో ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లు కీలక పాత్ర వహించాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో తక్షణమే టెస్టులు చేసి పాజిటివ్‌ వ్యక్తులను గుర్తించే వీలు కలిగింది.
వాస్తవానికి ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కంటే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ ఎక్కువ ఖరీదు అయినప్పటికీ, సత్వర ఫలితం వస్తుండటంతో దీనికి ప్రాధాన్యమిస్తున్నారు.

ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లలో సత్ఫలితాలు
ఓవైపు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తూనే మరో వైపు ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లతోనూ పరీక్షలు చేస్తూ వచ్చాం. ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లతో సత్వర ఫలితాలు రావడం వల్ల బాధితులను వెంటనే ఐసొలేషన్‌ (ఇంట్లో లేదా ఆస్పత్రిలో) చేయగలిగాం. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి పెరగకుండా చూశాం. వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పరీక్ష చేయగలగడం వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలిగాం. 
- కాటమనేని భాస్కర్‌, కమిషనర్‌, కుటుంబ సంక్షేమ శాఖ

ఈ నెల 22 నాటికి మొత్తం టెస్టులు 96,62,220
మొత్తం ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు   35,66,496
వీటిలో పాజిటివ్‌గా వచ్చినవి     4,08,668
నెగిటివ్‌గా వచ్చినవి   31,55,092
వెయిటింగ్‌లో ఉన్నవి   472
ఆగస్ట్‌లో ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ధర      రూ.410
నవంబర్‌లో ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ధర    రూ.272 

    
           
       
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు