ఏపీ: వడివడిగా పేదల ఇళ్ల నిర్మాణం..

4 May, 2021 09:45 IST|Sakshi

తొలిదశలో 15,10,227 గృహాల నిర్మాణం

31 నాటికి అన్ని లే అవుట్లలో ప్రారంభించేలా చర్యలు

సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకం కింద ‘వైఎస్సార్‌ – జగనన్న’ కాలనీల్లో  వడివడిగా ఇళ్ల నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేసింది. ‘అందరికీ ఇళ్లు పథకం’ కింద ప్రభుత్వం రికార్డుస్థాయిలో దాదాపు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. వీటిలో మొదటి దశలో 15,10,227 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. అన్ని లే అవుట్లలో ఈ నెల 31 నాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

అందుకోసం ఇళ్ల స్థలాల మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్, జాబ్‌ కార్డ్‌ అప్లికేషన్‌ ప్రక్రియను ఈ నెల 15 లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులకు సిమెంట్, ఇనుము, ఇతర ముడిసరుకు సరఫరా చేసేవారికి సకాలంలో బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. ప్రతివారం లబ్ధిదారులు, సరఫరాదారులకు వారి బ్యాంకు ఖాతాల్లోనే బిల్లుల మొత్తాన్ని జమ చేస్తారు. దీంతో అన్ని జిల్లాల్లో గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారుల ఇళ్ల స్థలాల మ్యాపింగ్, జియో ట్యాగింగ్‌ ప్రక్రియను వేగవంతం చేశారు.

15లోగా మ్యాపింగ్, జియో ట్యాగింగ్‌..
మొదటి దశలో మంజూరైన 15,10,227 ఇళ్లకు సంబంధించి 12,61,928 ఇళ్ల స్థలాల మ్యాపింగ్‌ పూర్తి చేశారు. దాదాపు 84% ఇళ్ల స్థలాల మ్యాపింగ్‌ పూర్తయ్యింది. మిగిలింది ఈ నెల 15లోగా పూర్తి చేయనున్నారు. ఇక 7,81,430 ఇళ్ల స్థలాలకు అంటే దాదాపు 52% జియో ట్యాగింగ్‌ పూర్తి చేశారు. మిగతాదీ గడువులోగా పూర్తి చేయనున్నారు. 

మరిన్ని వార్తలు