వేగంగా కొత్త వంతెనల నిర్మాణం

23 May, 2022 04:14 IST|Sakshi

బల్లకట్టు, పుట్టి ప్రయాణాల నుంచి విముక్తి

రూ.262 కోట్లతో 25 కొత్త వంతెనలు 

నిడా–రెండో దశ కింద పనులు

రాష్ట్ర ప్రధాన రహదారుల్లో 16, జిల్లా ప్రధాన రహదారుల్లో 7, జిల్లా రోడ్లపై మరో 2

త్వరగా పూర్తి చేయాలని ఆర్‌ అండ్‌ బీ నిర్ణయం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నదులు, కాలువలు, వాగులు దాటడానికి పడవలు, బల్లకట్లు, పుట్టిలు వంటి ప్రమాదకర ప్రయాణాల నుంచి ప్రజలకు విముక్తి కలగనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వంతెనల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రూ.2,205 కోట్లతో రహదారుల పునర్నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పుడు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రధాన, మైనర్‌ వంతెనల నిర్మాణాన్ని కూడా వేగంగా చేపడుతోంది.

నాబార్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ (నిడా) రెండో దశ కింద రూ.262.36 కోట్లతో 25 వంతెనల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒక్కోవంతెనతో కనీసం లక్ష మంది ప్రజలకు నదులు, వాగుల మీదుగా రాకపోకలు సులభంగా సాగించొచ్చు. రాష్ట్ర ప్రధాన రహదారుల్లో 16, జిల్లా ప్రధాన రహదారుల్లో 7, ఇతర రోడ్లపై రెండు వంతెనలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 8 వంతెనల నిర్మాణం వేగం పుంజుకుంది. మిగిలిన 17 వంతెనల పనుల కోసం ఆర్‌ అండ్‌ బి శాఖ త్వరలో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభించనుంది.

► రాష్ట్ర ప్రధాన రహదారుల్లో రూ.87.22 కోట్లతో 16 వంతెనల నిర్మాణాన్ని ఆర్‌ అండ్‌ బి  చేపట్టింది. వాటిలో ఆరు వంతెనల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటితోపాటు మిగతా 10 వంతెనల పనులను ఏడాదిలోగా పూర్తి చేయనున్నారు. 
► జిల్లా ప్రధాన రహదారుల్లో రూ.162.95 కోట్లతో ఏడు వంతెనల నిర్మాణాన్ని చేపట్టింది. వాటిలో రెండు వంతెనల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మిగతా ఐదింటి పనులను ఆర్‌ అండ్‌ బి శాఖ త్వరలో ప్రారంభించనుంది. 
► ఇతర రహదారుల్లో రూ.12.19 కోట్లతో రెండు వంతెనల నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆర్‌ అండ్‌ బి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.   

మరిన్ని వార్తలు