AP Aarogyasri: ఆరోగ్యశ్రీ ద్వారా అరుదైన క్యాన్సర్‌ నుంచి విముక్తి 

29 Sep, 2021 04:23 IST|Sakshi
మొహమ్మద్‌ నజీర్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్‌ నాగకిషోర్, వైద్యులు

గుంటూరు (మెడికల్‌): రెండోసారి క్యాన్సర్‌ బారినపడిన యువకుడికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి ఆ వ్యాధి నుంచి విముక్తి కల్పించారు గుంటూరు వైద్యులు. రూ.3 లక్షల ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్సను వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో అందించారు. మంగళవారం గుంటూరు ఒమెగా హాస్పిటల్‌లో సీనియర్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ ఎంజీ నాగకిషోర్‌ ఈ వివరాలు వెల్లడించారు. స్థానిక మంగళదాస్‌ నగర్‌కు చెందిన మొహమ్మద్‌ నజీర్‌ అనే 18 ఏళ్ల యువకుడికి నాలుగేళ్ల క్రితం ఛాతి పక్కటెముకలకు ‘ఈవింగ్స్‌ సర్కోమా’ అనే క్యాన్సర్‌ సోకింది.

హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో సుమారు రూ.6 లక్షలు వెచ్చించి సర్జరీ చేయించుకున్నాడు. ఇటీవల ఆ యువకుడికి ట్యూమర్‌ ఏర్పడి క్యాన్సర్‌ తిరగబెట్టింది. యువకుడి తండ్రి మొహమ్మద్‌ బాజీ గుంటూరు ఒమెగా ఆస్పత్రికి అతడిని తీసుకెళ్లగా.. పరీక్షలు చేసి ఛాతి నుంచి గుండెకు వెళ్లే మార్గంలో భారీ గడ్డ ఉన్నట్టు నిర్ధారించారు. మూడు నెలలపాటు మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీకాంత్, డాక్టర్‌ స్నేహ కీమోథెరఫీ చేసినప్పటికీ గడ్డ కొద్దిగా మాత్రమే తగ్గింది. ఊపిరితిత్తుల్లో ఉన్న ట్యూమర్‌ను (గడ్డను) వెంటనే తొలగించకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని నిర్ధారించి ఈ నెల 17న నాలుగున్నర గంటల సేపు శ్రమించి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా చేశారు.

డాక్టర్‌ నాగకిషోర్‌ నేతృత్వంలో కార్డియో థొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ మారుతి ప్రసాద్, డాక్టర్‌ సుమన్, మత్తు డాక్టర్‌ శౌరయ్య, డాక్టర్‌ విద్యాసాగర్‌ ఈ శస్త్ర చికిత్సలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నిరకాల క్యాన్సర్లకు ఉచితంగా చికిత్స అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చారన్నారు. దీంతో ఆ యువకుడికి చికిత్సను పూర్తి ఉచితంగా చేశామని డాక్టర్‌ నాగకిషోర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు