చరిత్రకు సాక్ష్యాలు స్టాంపులు, నాణేలు.. విశ్రాంత రైల్వే ఉద్యోగి అపూరూప కలెక్షన్‌ 

18 Aug, 2022 04:42 IST|Sakshi

స్టాంప్‌లు, నాణేలు సేకరించిన  విశ్రాంత రైల్వే ఉద్యోగి కృష్ణారావు 

జాతీయ స్థాయిలో ప్రదర్శనలు

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): చరిత్రకు సాక్ష్యాలు స్టాంపులు, నాణేలు. వివిధ దేశాలకు చెందిన నాణేలు, స్టాంపులను సేకరించి ఎన్నో ప్రదర్శనలిచ్చారు నగరానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి అమ్ము కృష్ణారావు. 1978లో ఆయన కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ క్షేత్రాలను సందర్శించారు. ఆ సమయంలో గంగా నదిలో నేపాల్‌ దేశానికి చెందిన 2 పైసలు, చిన్న సైజు కోడిగుడ్డు ఆకారంలో ఉన్న నున్నని రాయి ఆయనకు దొరికాయి. నేపాల్‌ 2 పైసల మీద ఆవు, ఎవరెస్ట్‌ శిఖరం, త్రిశూలం, ఢమరుకం గుర్తులు ఉండడంతో ఆ నాణేన్ని, రాయిని తన పూజ గదిలోకి చేర్చారు.

అంతకుముందు 1972లో హైదరాబాద్‌లో నివసిస్తున్న సమయంలో రోజువారీ ఖర్చులు పోనూ మిగిలిన చిల్లర నాణేల్లో బొమ్మలున్న వాటిని పక్కన పెట్టడం అలవాటు చేసుకున్నారు. 1984లో సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో టెక్నీషియన్‌ గ్రేడ్‌–3గా టిట్లాఘడ్‌లో రైల్వేలో కృష్ణారావు ప్రస్థానం ప్రారంభించారు. 1985లో కుటుంబంతో కలిసి దక్షిణ భారత యాత్ర చేస్తున్న సమయంలో రామేశ్వరంలో శ్రీలంక నాణేలు కొన్ని దొరికాయి. అలా నాణేల సేకరణ పట్ల ఆకర్షితులై నాటి నుంచి నేటి వరకు వందల సంఖ్యలో నాణేలను ఆయన సంపాదించారు.

1990లో విశాఖపట్నం డీజిల్‌ లోకో షెడ్‌కు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ఏటా జరిగే విశ్వకర్మ పూజ రోజున ఈ నాణేలను ప్రదర్శించేవారు కృష్ణారావు. 2000లో వారణాసిలోని ఓ ఆలయ ప్రాంగణంలో నేలపై వెండి నాణేలు తాపడం చేసి ఉండడం చూసిన ఆయన తన దృష్టిని అటు వైపుగా సారించారు. ఇంకా ఎంతో సాధించాల్సింది ఉందని ఆ రోజు తెలుసుకున్నారు. అప్పుడే విశాఖపట్నంలోని న్యూమిస్మాటిక్‌ అండ్‌ ఫిలాటెలిక్‌ అసోసియేషన్‌లో జీవితకాల సభ్యుడిగా చేశారు. నాణేలు, కరెన్సీ సేకరణలో మెళకువలు నేర్చుకున్నారు. 2022 ఏప్రిల్‌ 30న ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలో సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌గా రిటైర్‌ అయ్యారు. 

రైల్వేపై ఆసక్తి ఇలా...  
ఇలా సాగిపోతున్న సమయంలో 2003లో నాగ్‌పూర్‌ పోస్ట్‌ ఆఫీస్‌లో 150 ఏళ్ల భారతీయ రైల్వేల ప్రస్థానంపై విడుదల చేసిన ప్రత్యేక స్టాంప్, మినీయేచర్‌ షీట్‌ను ఆయన చూశారు. అప్పుడే రైల్వే మీద విడుదల చేసిన స్టాంపుల సేకరణ మొదలుపెట్టారు. రైల్‌ జర్నీ త్రూ పోస్టల్‌ స్టాంప్స్‌ అనే పేరుతో 2004లో నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొని రజత పతకం కైవసం చేసుకున్నారు. 2007లో చెన్నైలో జాతీయస్థాయి ప్రదర్శనలో రజతం, 2011లో న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. దీనికి కొనసాగింపుగా రైల్వే టోకెన్లు, నాణేలు, కరెన్సీ మొదలైనవి సేకరించారు. వీటితో సుమారు 100 ప్రదర్శనలిచ్చి ఎన్నో ప్రశంసలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు కృష్ణారావు. 

ఇవే కాకుండా... 
ఇవి మాత్రమే కాకుండా బ్రిటిష్‌ ఇండియా కాయన్ల కలెక్షన్‌ ఆయన వద్ద ఉంది. 1835 నుంచి 1947 వరకు గల వివిధ నాణేలను ఆయన సేకరించారు. 1950 నుంచి నేటి వరకు అన్ని మింట్లు విడుదల చేసిన నాణేలు ఆయన వద్ద ఉన్నాయి. స్మారక నాణేల సెట్, 1, 2, 5, 20 రూపాయల కరెన్సీ, సిగ్నేచర్, ఇన్‌సెట్, ప్రిఫిక్స్‌ ప్రకారం సేకరించారు. స్టార్‌ నోట్స్‌ 1, 10, 20, 50, 100, 200 ఆయన కలెక్షన్‌లో చేరాయి.

అమృతోత్సవాల్లో సైతం... 
ఇటీవల వాల్తేర్‌ డివిజన్‌ నిర్వహించిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో కృష్ణారావు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాపూజీ జీవిత విశేషాలతో కూడిన 200 ప్రత్యేక ఫొటోలతో ఎగ్జిబిషన్, స్టాంపుల, నాణేల ప్రదర్శనను ఆయన ఏర్పాటు చేశారు. దీనిని తిలకించిన డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అనూప్‌ కుమార్‌ సత్పతి కృష్ణారావును ప్రత్యేకంగా అభినందించారు.
చదవండి: బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా?

మరిన్ని వార్తలు