ఊహించని అద్భుతం: తల్లి దక్కదు, బిడ్డనైనా సేవ్‌ చేద్దామనుకున్నారు..

20 Jan, 2022 13:06 IST|Sakshi
వైద్యులు ఆపరేషన్‌ చేసి బయటకు తీసిన మగబిడ్డ, మృత్యువు ఒడినుంచి బయటపడి చికిత్స పొందుతున్న నాగమణి 

ఏరియా ఆస్పత్రి చరిత్రలో అరుదైన ఘటన 

హ్యాట్సాప్‌ వైద్యబృందం అంటూ పీఓ కితాబు

కూనవరం (తూర్పుగోదావరి): తల్లి దక్కదు, బిడ్డనైనా సేవ్‌ చేద్దామంటూ ముందుకు వచ్చిన వైద్య బృందానికి ఊహించని అద్భుతం తారసపడంతో వారి ఆనందానికి అవధులు లేవు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం జరిగిన అరుదైన ఈ ఘటన ఆస్పత్రి చరిత్రలోనే లిఖించదగినదిగా పలువురు ప్రసంశిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే కూనవరం మండలం టేకులబోరు గ్రామానికి చెందిన జోడె నాగమణి నిండు గర్భిణి. వచ్చే నెల 4వ తేదీన ఆమెకు కాన్పు కావలసి ఉంది. ప్రస్తుతం బీపీకి మందులు వాడుతోంది. దానికితోడు ఆయాసం ఎక్కువైంది. నొప్పులు రావడంతో కూనవరం మండలం కోతులగుట్ట సీహెచ్‌సీకి వెళ్లింది.

చదవండి: (అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి) 

అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని గ్రహించి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి రిఫర్‌ చేస్తూ  ఆ విషయాన్ని కోతులగుట్ట సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కోటిరెడ్డికి సమాచారం ఇచ్చారు. డాక్టర్‌ కోటిరెడ్డి ఈ విషయాన్ని చింతూరు ఐటీడీఏ పీఓ ఆకుల వెంకటరమణకు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ పుల్లయ్యకు చేరవేశారు. అప్పటికే నాగమణి కోమాలోకి వెళ్లింది. భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెలో చలనం కనిపించలేదు. మృత్యువు ఒడిలోకి జారుకున్న ఆ మహిళను చూసి మదనపడుతున్న వైద్యుల వద్దకు డాక్టర్‌ కోటిరెడ్డి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ పుల్లయ్య వెళ్లి కనీసం కడుపులో ఉన్న బిడ్డనైనా సేవ్‌ చేయాలని భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరిం టెండెంట్‌ రామకృష్ణను కోరారు.

చదవండి: (ఒకే కూర.. ఒకే స్వీటు.. మత పెద్దల సంచలన నిర్ణయం)

గర్భిణి సోదరుడు జోడె నాగేశ్వరరావు, భర్త సత్యనారాయణకు పరిస్థితి వివరించి అంగీకరింపజేశారు. డాక్టర్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో గైనకాలజిస్ట్‌ నరసయ్య, ఎనస్తీషియన్‌ కిషన్, ఐసీయూ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది బృందంగా ఏర్పడి ఆపరేషన్‌ చేసి మగబిడ్డను బయటకు తీశారు. అనంతరం కొద్దిసేపటికి తల్లిలో కూడా కదలికలు గమనించిన వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ అద్భుతం చూసిన వైద్యులు ఆమెకు వెంటనే వైద్య సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమం. ప్రస్తుతం భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోనే ఇది అరుదైన సంఘటన అని అక్కడి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామకృష్ణ అన్నారు. వైద్యబృందం కృషిని ఐటీడీఏ పీఓ ఆకుల వెంకటరమణ మెచ్చుకున్నారు.

మరిన్ని వార్తలు