‘పెన్‌స్టేట్‌’ వర్సిటీ అధ్యక్షురాలిగా నీలి బెండపూడి 

11 Dec, 2021 03:21 IST|Sakshi

ఏయూ పూర్వవిద్యార్థినికి అరుదైన అవకాశం

ఏయూక్యాంపస్‌ (విశాఖ తూర్పు)/సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా యూనివర్సిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఏయూ పూర్వవిద్యార్థిని నీలి బెండపూడి నియమితులయ్యారు. ఈ నెల 9వ తేదీన జరిగిన పెన్సిల్వేనియా (పెన్‌స్టేట్‌) యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో ఏకగ్రీవంగా నీలి బెండపూడిని నూతన అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. వచ్చే సంవత్సరం జనవరిలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం నీలి బెండపూడి యూనివర్సిటీ ఆఫ్‌ లూయిన్‌ విల్లీ కెంటగీ అధ్యక్షురాలిగా, మార్కెటింగ్‌ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

నీలి బెండపూడి విశాఖ నగరంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా స్వీకరించారు. అనంతరం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గతంలో ఆమె కేన్సాస్‌ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌చాన్సలర్‌గా సేవలందించారు. నీలి బెండపూడి తల్లిదండ్రులు ఆచార్య రమేష్‌ దత్త, పద్మదత్త ఇరువురూ ఏయూ ఆంగ్ల విభాగం ఆచార్యులుగా పనిచేశారు. నీలి బెండపూడిని ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి  అభినందించారు.

రికార్డు సృష్టించారు : సీఎం జగన్‌ 
పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నీలి బెండపూడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలియజేస్తూ శుక్రవారం ట్వీట్‌ చేశారు. విశాఖపట్నంకు చెందిన ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థిని అయిన నీలి బెండపూడి ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా యూనివర్సిటీ పెన్‌ స్టేట్‌కి ఎన్నికైన తొలి మహిళా ప్రెసిడెంటుగా రికార్డు సృష్టించారన్నారు.

కుమార్‌ అన్నవరపు అభినందనలు..
పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నీలి బెండపూడికి ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కో–ఆర్డినేటర్‌ (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం) కుమార్‌ అన్నవరపు అభినందనలు తెలిపారు.  

మరిన్ని వార్తలు