పాడిపరిశ్రమ అభివృద్ధికి రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌

3 Nov, 2022 16:52 IST|Sakshi

దేశీయ పశుజాతుల వృద్ధికి సర్కార్‌ సమాయాత్తమైంది. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆడ దూడల సృష్టి ద్వారా పాడి పరిశ్రమాభివృద్ధితో పాటు రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఒంగోలు, గిర్‌ వంటి ఉన్నత దేశీయ జాతులకు పూర్వవైభవాన్ని తీసుకురావడం ద్వారా పాల ఉత్పత్తి పెంచేందుకు జిల్లా పశుసంరక్షణశాఖ దృష్టి సారించింది. ఈ నెల 1వ తేదీ నుంచి రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ పథకాన్ని జిల్లాలో అమల్లోకి తెచ్చింది. 

చీమకుర్తి(ప్రకాశం జిల్లా): పశువుల్లో సహజ, కృత్రిమ గర్భధారణతో 50 శాతం మగ, 50 శాతం ఆడ దూడలు పుడుతుంటాయని పశువైద్యుల నిపుణుల అంచనా. ఆడదూడల పెంపకం ద్వారా పాడి రైతులకు లాభాలు వస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. దీంతో ఆడదూడల పుట్టుకను నిర్ధారించే వీర్యకణాలను ఎంపిక చేసి రెండు స్ట్రాలలో నింపుతారు. ఒక్కో ఆవు లేక ఒక్కో గేదెను పెంచుకునే రైతులకు వీటిని అందజేస్తారు. ఎదకు వచ్చిన గేదె లేక ఆవుకు తొలి విడతగా ఒక స్ట్రాతో ఇంజెక్షన్‌ చేస్తారు. ఒక స్ట్రాతో సూడి నిలిచినట్లయితే పర్వాలేదు.

ఒక వేళ సూడి నిలవకపోతే తిరిగి 21 రోజుల తర్వాత రెండోసారి ఎదకు వస్తుంది. అప్పుడు రైతుల లెక్కలో ముందుగానే ఉంచిన రెండో స్ట్రాతో రెండోసారి ఇంజెక్షన్‌ చేస్తారు. ఇలా సార్టెడ్‌ సెమన్‌తో ఆవులు లేక గేదెలలో సూడి నిలిచి 9 నెలల తర్వాత పుట్టే దూడలు దాదాపు 99 శాతం ఆడదూడలే పుడతాయని అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం కేంద్రం రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. పాడి పశువులతో గ్రామాలు కళకళలాడేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని జిల్లాలో ప్రారంభించామని పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్‌ కే.బేబీరాణి తెలిపారు.  

తొలి విడతలో చేపట్టే మండలాలు.. 
ఆడదూడల ఉత్పత్తికి సంబంధించి తొలుత జిల్లాలో ఎక్కువగా పాడిపశువులను పెంచే గ్రామాలపై అధికారులు దృష్టి సారించారు. చీమకుర్తి, సంతనూతలపాడు, ఒంగోలు, నాగులుప్పలపాడు, దర్శి, తాళ్ళూరు, ముండ్లమూరు, కొత్తపట్నం, టంగుటూరు, కొండపి, శింగరాయకొండ, జరుగుమల్లి, పొన్నలూరు మండలాల్లో రాష్ట్రీయ 
గోకుల్‌ మిషన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు.  

2500 పశువులకు 5 వేల వీర్యకణాల స్ట్రాల పంపిణీ:  
రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ పథకంలో భాగంగా జిల్లా పశుగణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే 2500 పశువులను ఎంపిక  చేశారు. వాటికి 5 వేల సార్టెడ్‌ సెమన్‌ స్ట్రాలను పంపిణీ చేశారు. ఒక్కో పశువుకు అందించే రెండు స్ట్రాలను ప్రభుత్వం రూ.1350కు అందిస్తుంది. దానిలో రూ.850 సబ్సిడీ ఇస్తోంది. ఇక రైతు కేవలం రూ.500 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఒక వేళ రైతులకు అందించిన రెండు స్ట్రాలతో పశువులు సూడికి రాకపోతే రైతులు చెల్లించిన రూ.500ను తిరిగి చెల్లిస్తారు. ఒక వేళ సూడికి వచ్చి ఆడదూడలు పుట్టకుండా మగదూడ పుడితే రైతులకు రూ.250 తిరిగి చెల్లిస్తారు.  

ఏటా 1.50 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ:  
ప్రభుత్వ పశువుల ఆస్పత్రుల ద్వారా ఏటా జిల్లాలో సరాసరిన 1.50 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తారు. దానికి గాను 3.5 లక్షల సాధారణ సెమన్‌లతో కూడిన స్ట్రాలను వినియోగిస్తారు. దాని వలన ఆడ, లేక మగ దూడలు ఏవైనా రావచ్చు. అయితే రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ ద్వారా కేవలం ఆడదూడల ఉత్పత్తి లక్ష్యంగా చేసుకొని ప్రయోగాత్మకంగా ఈ ఏడాది 2500 పశువులలో అమలు చేస్తున్నారు. దానికి గాను 5 వేల సార్టెడ్‌ సెమన్‌స్ట్రాలను అందించేందుకు రంగం సిద్ధం చేశారు. వచ్చే ఏడాది 5 వేల పశువులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇలా ప్రతి ఏడాది పశువుల సంఖ్యను డబుల్‌ చేసుకుంటూ ఆడదూడల ఉత్పత్తికి పశుగణాభివృద్ధి శాఖ కంకణం కట్టుకుంది. రానున్న ఐదేళ్లలో ప్రతి గ్రామంలో కనీసం 300 నుంచి 500 లీటర్ల పాలు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 

ఆడదూడల ఉత్పత్తి పెంచేలా..  
రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ ద్వారా ఆవులు, గేదెలలో 99 శాతం ఆడదూడలను ఉత్పత్తి చేసేందుకు లక్ష్యంగా సెక్స్‌ సార్టెడ్‌ సెమన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమాన్ని ఈనెల 1వ తేదీ నుంచి తొలుత 2500 పశువులలో అమలు చేయనున్నాం. ఇప్పటికే 5 వేల సార్టెడ్‌ సెమన్‌ ఇంజక్షన్‌లను సరఫరా చేశాం. 
– డాక్టర్‌ కే.బేబీరాణి, జాయింట్‌ డైరెక్టర్, జిల్లా పశుసంవర్థక శాఖ, ఒంగోలు 

కొండ ప్రాంతాల వారికి కోడెదూడలు ఉచితం
కొండ ప్రాంతాల్లో ఆవులను పెంచే పశుపోషకులకు ప్రభుత్వం కోడెదూడలను ఉచితంగా అందిస్తుంది. 10 నుంచి 20 ఆవులు కలిగిన యజమానికి 6 నెలల వయస్సు కలిగిన కోడెదూడను అందిస్తారు. చదలవాడ పశువుల క్షేత్రం వద్ద పెరుగుతున్న కోడెదూడలను ఇందుకు వినియోగిస్తారు. కోడెదూడ పెరిగి పెద్దయ్యే వరకు దానికి దాణ, ఇతర ఖర్చులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. అనంతరం కోడెదూడకు క్రాసింగ్‌ చేసే వయస్సు రాగానే ఆవులలో సార్టెడ్‌ సెమన్‌ స్ట్రాలతో పనిలేకుండా వాటిని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అధికారులు పశుపోషకులకు కోడెదూడలను ఉచితంగా అందిస్తారు. యర్రగొండపాలెం, గిద్దలూరు, పీసీపల్లి, పుల్లలచెరువు వంటి కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లోని ఆవులు కలిగిన రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. 

మరిన్ని వార్తలు