30 నిమిషాల్లోనే రేషన్‌కార్డులు

19 Sep, 2020 05:14 IST|Sakshi
లింగగూడెం లబ్ధిదారులకు రేషన్‌కార్డులు అందజేస్తున్న తహసీల్దార్, సచివాలయ సిబ్బంది

కృష్ణాజిల్లాలో ముగ్గురికి కార్డులు పంపిణీ చేసిన వైనం

లింగగూడెం (పెనుగంచిప్రోలు) /ఎ.కొండూరు: ఏళ్లపాటు కాళ్లరిగేలా తిరిగినా మంజూరు కాని రేషన్‌కార్డులు ఇప్పుడు నిమిషాల్లోనే చేతికి అందుతున్నాయి. కృష్ణాజిల్లాలో శుక్రవారం దరఖాస్తు చేసుకున్న 30 నిమిషాల్లోనే ముగ్గురికి రేషన్‌ కార్డులు అందాయి. సీఎం ప్రారంభించిన గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజల సమస్యలు గంటల్లోనే పరిష్కారం అవుతున్నాయి అనడానికి ఇదే నిదర్శనమంటున్నారు. పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో గంగదారి అరుణ, రామారావు దంపతులు, మాదిరాజు నరేష్, రమాదేవి దంపతులు గతంలో కార్డుకోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో వారు శుక్రవారం వలంటీర్‌ను కలిసి ఉదయం 10.15 గంటలకు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేశారు.

అయితే 10.30 గంటలకు గ్రామ సచివాలయంలో కార్డులు ప్రింటయ్యాయి. 10.40 గంటలకల్లా తహసీల్దార్‌ షకీరున్నీసాబేగం, ఎంపీడీవో రాజు గ్రామానికి వచ్చి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఎ.కొండూరు మండలం వల్లంపట్లలో బాణావత్‌ పాప కుటుంబం గ్రామ సచివాలయంలో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. వెంటనే కార్డు మంజూరైంది. 30 నిమిషాల్లోనే సచివాలయ సిబ్బంది కార్డును ప్రింట్‌ తీసి లబ్ధిదారులకు అందజేశారు.  

మరిన్ని వార్తలు