కర్ణాటకలోనూ ఇంటికే రేషన్‌!

26 Oct, 2021 03:26 IST|Sakshi

ఏపీ తరహాలో అమలుకు సన్నద్ధం

‘అన్నభాగ్య’ పథకంతో మొదలు

‘అధికారం కేవలం విధానసౌథకే పరిమితం కాకుండా పంచాయతీల పరిధిలోనే ప్రజలకు అన్ని సేవలు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటాం. అభివృద్ధే ప్రజల వద్దకు వచ్చేలా పాలన సాగాలి. జనవరి 26 తరువాత రేషన్‌ సరుకులను ఇంటివద్దే అందించే యోచన చేస్తున్నాం. అతి త్వరలో కార్యాచరణను రూపొందించి ప్రకటిస్తాం. ఇదే కాకుండా పింఛన్లు లాంటి సామాజిక భద్రత సేవలు కూడా ఇంటివద్దే అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం’
– ఇటీవల దావణగెరె జిల్లా సభలో కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై

సాక్షి, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న తరహాలోనే పలు పథకాలను ఇంటివద్దే లబ్ధిదారులకు అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతోంది. ప్రధానంగా రేషన్‌ సరుకులను ఇంటివద్దే డోర్‌ డెలివరీ చేయడంపై కర్ణాటక ప్రభుత్వం దృష్టి సారించింది. ‘అన్నభాగ్య’ పథకం కింద లబ్ధిదారులకు ఇంటివద్దే రేషన్‌ సరుకులను అందించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంటి వద్దే రేషన్‌ సరుకులను అందచేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అమలవుతున్న ఈ విధానంపై కర్ణాటక పౌర సరఫరాల శాఖ అధికారులు నిశితంగా అధ్యయనం చేశారు. ఇంటి వద్దకే రేషన్‌ విధానాన్ని జనవరి నుంచి అమలు చేస్తామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో తదనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పూర్తైన కంప్యూటరైజేషన్‌..
కర్ణాటకలో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి స్థాయిలో కంప్యూటరైజేషన్‌ చేశారు. ప్రస్తుతం అక్కడ 10,89,445 అంత్యోదయ, 1,15,02,798 బీపీఎల్, 21,44,006 ఏపీఎల్‌ కార్డులతో కలిపి మొత్తం 1,47,36,249 రేషన్‌ కార్డులున్నాయి. 19,963 రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతి నెల బీపీఎల్, ఏపీఎల్‌ కార్డుదారులకు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. ఏపీఎల్‌ కార్డుదారులకు కేజీ రూ.15 చొప్పున 10 కిలోల బియ్యాన్ని అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విధానాన్ని అనుసరించడం ద్వారా వీరందరికి ఇంటి వద్దే రేషన్‌ సరుకులు అందనున్నాయి.

కొత్త విధానం ఇలా..
ఆయా రేషన్‌ దుకాణాల నుంచి లగేజ్‌ ఆటో ద్వారా సరుకులు తరలిస్తారు. ఇంటింటికి వెళ్లి రేషన్‌ పంపిణీ చేసేందుకు ఇద్దరు సిబ్బందిని నియమిస్తారు. సరుకుల బరువు తూచే తూకం యంత్రం తదితరాలు ఆటోలో ఉంటాయి. 

మరిన్ని వార్తలు