పంజాబ్‌లోనూ ఇంటి వద్దకే రేషన్‌

1 May, 2022 04:06 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రవేశపెట్టిన ‘ఇంటి వద్దకే రేషన్‌’ విధానం, నాణ్యమైన బియ్యం పంపిణీని పలు రాష్ట్రాలు ప్రశంసించడంతో పాటు వాటి అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పంజాబ్‌లో కొలువుదీరిన ఆప్‌ ప్రభుత్వం ‘ఘర్‌ ఘర్‌ రేషన్‌ యోజన’ పేరుతో లబ్ధిదారుల ఇంటికే బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు రేషన్‌ కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేదని ఇటీవల పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రకటించారు. ‘తరచుగా రేషన్‌ పొందడానికి ఒక రోజు వెచ్చించాల్సి వస్తోంది. రేషన్‌ కోసం వృద్ధులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్తున్నారు.

ప్రజలకు చేరే రేషన్‌లోనూ నాణ్యత కొరవడింది. ఇకపై పంజాబ్‌లో ఇది కొనసాగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది’ అని చెప్పారు. నాణ్యమైన రేషన్‌ను శుభ్రమైన సంచులలో ప్యాక్‌ చేసి ఇంటికే పంపిణీ చేసేందుకు త్వరలోనే విధానాలను రూపొందించనున్నారు. ఆప్‌ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం పంజాబ్‌ కంటే ముందుగానే ఢిల్లీలో ఇంటింటికీ రేషన్‌ను పంపిణీ చేయాలనుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ అడ్డంకుల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా పర్యటనలో కేంద్ర బృందం, విజయవాడ పర్యటనలో కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్‌ అనిల్‌.. రాష్ట్రంలో రేషన్‌ పంపిణీ విధానంపై ప్రశంసలు కురిపించారు. దేశంలో దాదాపు 8 రాష్ట్రాలకు పైగా రేషన్‌ డోర్‌ డెలివరీపై ఆసక్తి కనబరుస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రజల కోసం అదనపు భారం భరిస్తున్న ఏపీ
వాస్తవానికి ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది కిందటే రాష్ట్రంలో ఇంటి వద్దకే నాణ్యమైన రేషన్‌ పంపిణీకి శ్రీకారం చుట్టారు. గంటల పాటు క్యూలో నిల్చుని రేషన్‌ సరుకులు తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు çపడుతుండటంతో పాటు ఒక రోజు పనిని వదులుకుని, కూలి పోగొట్టుకోవాల్సి వచ్చేది. ఇటువంటి వారి కోసం రూ.530 కోట్లకు పైగా వ్యయంతో 2021 ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 9,260 మొబైల్‌ వాహనాలతో రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రాష్ట్రంలో మొత్తంగా 1.45 కోట్ల కార్డుదారులు ఉండగా, నెలలో 18 రోజుల పాటు వీరందరికీ ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. ఒక్కో వాహనం విలువ రూ.5.81 లక్షలు కాగా, ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తోంది. ఈ వాహనాలను వాడుకున్నందుకు పౌర సరఫరాల శాఖ నెలకు సుమారు రూ.16.67 కోట్లకు పైగా చెల్లిస్తోంది. దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహనదారుడితో పాటు హెల్పర్ల కింద సుమారు 17 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ఇలా ఏటా నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సుమారు రూ.830 కోట్లకు పైగా ప్రజల కోసం అదనపు భారం భరిస్తోంది.  

మరిన్ని వార్తలు