రేషన్‌ బియ్యం ఇక పూర్తి ఉచితం

19 Jan, 2023 11:53 IST|Sakshi

ఉమ్మడి  పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి నెల 16,474 మెట్రిక్‌ టన్నుల పంపిణీ

751 వాహనాల ద్వారా ఇంటి వద్దకే బియ్యం

11.78 లక్షల కార్డుదారులకు లబ్ధి

జిల్లాలో ఏడాది పాటు కొనసాగింపు

సాక్షి ప్రతినిధి, ఏలూరు:  రేషన్‌ బియ్యాన్ని ఇక పూర్తి ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకూ కిలోకి రూపాయి తీసుకునేవారు. ఇక నుంచి పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇప్పటికే సంక్షేమ పథకాలతో భరోసా ఇస్తున్న సర్కారు నూతన సంవత్సరం నుంచి జిల్లాలో ఉచిత రేషన్‌ అమలు చేయనుంది. ప్రతి నెల 16,474 మెట్రిక్‌ టన్నులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. రేషన్‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున రేషన్‌ బియ్యాన్ని అందిస్తూ కిలో ఒక్క రూపాయికే ప్రభుత్వం సరఫరా చేస్తుంది.

ఇక నుంచి నూతన సంవత్సరంలో సంవత్సరం పాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా రేషన్‌ బియ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేషన్‌ వాహనాలు ద్వారా అందించే పంచదార, కందిపప్పుకు మాత్రమే డబ్బులు తీసుకోనున్నారు. కేజీ కందిపప్పుకు రూ.67, అరకిలో పంచదారకు రూ.17 తీసుకోవాలని, బియ్యం మాత్రం ఉచితంగానే అందించాలని ఆదేశించింది. ఈఏఏవై కార్డుదారులకు కేజీ పంచదార రూ.13.50కే అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.  

నూతన సంవత్సర కానుకగా.. నూతన సంవత్సర కానుకగా అందించే ఈ బియ్యం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏలూరు జిల్లాలో 6,42,526 కార్డులకు గాను 17,87,981 మందికి అందిస్తారు. అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో 5,36,423 కార్డులకు గాను 15,06,921 మంది ప్రజలకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,474 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రతి నెల ఉచితంగా ఆయా కార్డుదారులకు అందిస్తున్నారు. ఏలూరు జిల్లాలో 1,164 రేషన్‌ దుకాణాల ద్వారా 408 రేషన్‌ వాహనాలు, అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో 1011 రేషన్‌ దుకాణాల ద్వారా 343 రేషన్‌ వాహనాలు కార్డుదారుల ఇంటి వద్దకే బియ్యాన్ని తీసుకువెళ్ళి ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  

పేద ప్రజల్లో ఆనందం 
ప్రభుత్వం ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్‌ సరఫరా చేయడంతో పాటు నూతనంగా అందించే రేషన్‌ బియ్యాన్ని ఉచితంగా అందించడం పట్ల పేదలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమపై భారం పడకుండా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రేషన్‌ దుకాణాల చుట్టూ తిరుగుతూ వరుసలో నిలబడి రేషన్‌ డీలర్‌ ఇచ్చే బియ్యం కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని, ప్రస్తుతం తమకు ఆ బాధలు తప్పాయంటున్నారు. ఇంటికి తీసుకువచ్చి అందించే బియ్యాన్ని సైతం ఉచితంగా ఇవ్వడం పట్ల కార్డుదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  

ఇక నుంచి ఉచితంగా అందిస్తాం 
ప్రభుత్వ నిర్ణయంతో కార్డుదారులకు బియ్యం ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇతర సరుకులకు సొమ్ములు చెల్లించాలి. ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా కార్డుదారులకు బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. మిగిలిన సరుకులకు సొమ్ములు చెల్లించాల్సి ఉంది.  
– పీ.అరుణ్‌బాబు, జాయింట్‌ కలెక్టర్, ఏలూరు జిల్లా 

ఇప్పటికే వాహనాల ద్వారా సరఫరా  
ఇప్పటికే రేషన్‌ దుకాణాల నుంచి వాహనాల ద్వారా ప్రజల వద్దకే వెళ్ళి రేషన్‌ అందిస్తున్నాం. ఈ నేపధ్యంలో నూతనంగా ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు బియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంవత్సరం పాటు ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ సాగుతుంది.  
– ఈ.మురళీ, జాయింట్‌ కలెక్టర్, పశ్చిమగోదావరి జిల్లా 

మరిన్ని వార్తలు