కాళ్లలో లేదు చలనం ఆశల్లో ఉంది జీవనం

26 Apr, 2022 12:35 IST|Sakshi

19 ఏళ్లు..ఉత్సాహం ఉరకలెత్తే వయస్సు..ఎగసే అలల్లా జీవితంపై ఎన్నో ఆశలు..ఆకాంక్షలు..ఈ చురుకైన యువకుడ్ని చూసి విధికి కన్నుకుట్టింది. 2009లో జరిగిన ప్రమాదంలో నడవలేని స్థితికి చేరుకున్నాడు. కుటుంబంలో నిశ్శబ్ధ వాతావరణం..ఎదిగిన తమ బిడ్డ ఇలా దివ్యాంగుడిగా మారిపోవడం తల్లిదండ్రులు జీర్జించుకోలేకపోయారు. ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. అయితే ఆ యువకుడు కుంగిపోలేదు. సంద్రంలో అలలే స్ఫూర్తిగా తీసుకున్నాడా యువకుడు. జీవితంలో అవిటితనం ఓ చిన్న సమస్యే..అంతకు మించి జిందగీలో చాలా ఉందని భావించాడు. సూర్యుడు ఉదయిస్తాడు... అస్తమిస్తాడు... అస్తమించినంతమాత్రాన ఓడిపోయినట్టు కాదు...ఈ రవివర్మ కూడా అంతే...ఉదయించే సమయంలో విధి ఓటమి పాల్జేస్తే... నడవలేని స్థితిలో రవి ఆ విధిపై విజయం సాధించాడు. ర్యాప్‌ అనే ఫౌండేషన్‌ స్థాపించి ఎందరో దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు...ఆ విజేతే మన సీతమ్మధారకు చెందిన రవివర్మ.  
సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ప్రమాదానికి ముందు రవివర్మకు పర్యాటక ప్రాంతాలు వీక్షించడమంటే చాలా ఇష్టం. అయితే నడవలేని స్థితిలో ఉన్న రవి దాదాపు చాలా రోజులు యాత్రలకు వెళ్లలేకపోయాడు. తరువాత తనకుతాను స్ఫూర్తి నింపుకున్నాడు. ఇది కాదు జీవితం...లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌...దానిని ఆస్వాదించాలనుకున్నాడు. తన పనులు తాను చేసుకునేస్థాయిలో వచ్చాడు. వీలు చైర్‌లోనే నగరంలో తనకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లేవాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా యాత్రకు శ్రీకారం చుట్టాడు. కారుకు ప్రత్యేక మార్పులు చేయించాడు. తనుకు అనుకూలంగా కారును డిజైన్‌ చేయించుకున్నాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు విశాఖ నుంచి సోమవారం బయలుదేరాడు.  

వెలుగు రేఖ వెతకాలి
జీవితంలో ఓటమి ఎదురైందని చీకట్లో కూర్చుంటే వెలుగే కనిపించదు..మనసులో కుంగిబాటు అనే కర్టెన్‌ తీసేయాలి..అప్పుడు ఎంతటి బాధనైనా... అంగవైకల్యమైనా మనల్ని ఏమీ చేయలేదని తెలుస్తుంది. నా జీవితమే ఇందుకు ఓ ఉదాహారణ. కుంగిపోయి కూర్చుంటే నేనీరోజు దేశవ్యాప్తంగా యాత్ర చేసే స్థాయికి చేరుకునేవాడ్ని కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు కామన్‌..వాటిని అధిగమిస్తే విజేతగా నిలవవచ్చు. వంద రోజులకు పైగా దేశవ్యాప్త యాత్రలో వేల మంది దివ్యాంగులను కలిసి వారికి మనోధైర్యం నింపాలన్నదే నా లక్ష్యం.                
– రవి వర్మ

ఇటువంటి యాత్రలంటే ఇష్టం 
రవి వర్మకు ప్రమాదం జరగక ముందు నుంచి ఇంటువంటి యాత్రలు చేయడం ఇష్టం. ప్రమాదం జరిగిన తరువాత మేమంతా ధైర్యం కోల్పోయాం.  రవివర్మ మాత్రం ధైర్యం తెచ్చుకొని తన సాధారణ జీవితం గడిపేలే ప్రయత్నించేవాడు. ఇప్పుడు ఇన్ని రోజులు కారు యాత్రకు వెళ్తూ అందరిలో స్ఫూర్తి నింపాలనుకోవడం చాలా గర్వంగా ఉంది.  
– తల్లి రాజేశ్వరి, సోదరి పూజిత.

సాహసయాత్ర ప్రారంభం 
వీలుచైర్‌ కారు ద్వారా 24 వేల కిలోమీటర్లు యాత్ర చేస్తున్న రవివర్మ అందరికీ స్ఫూర్తి అని ఎంపీ ఎంవీవీ సత్యరాయణ అన్నారు. యాత్రను ఆయన సోమవారం బీచ్‌రోడ్డులో జెండా ఊపి ప్రారంభించారు. సాధారణ వ్యక్తికి సైతం 24 వేల కిలోమీటర్లు కారు యాత్ర చేయటం చాలా కష్టం. అటువంటిది రవివర్మ చేయడం నిజంగా సాహసమే. యాత్రలో ఎటువంటి ఇబ్బందుల లేకుండా విజవంతంగా పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్‌ రాజు, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, జీవీ తదితరులు పాల్గొన్నారు.

(చదవండి: విశాఖలో ఏపీఈఆర్‌సీ క్యాంపు కార్యాలయం!)

మరిన్ని వార్తలు