అక్రమ నీటి వాడకాన్ని తెలంగాణ వెంటనే ఆపాలి

30 Jun, 2021 04:50 IST|Sakshi

ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి

కేటాయించిన నీటిని న్యాయంగా వాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల

వల్లూరు: నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ చేస్తున్న అక్రమ నీటి వాడకాన్ని వెంటనే ఆపాలని కమలాపురం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ జిల్లా కడపలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం శ్రీశైలం నుంచి 114 టీఎంసీల నీటిని కృష్ణా ట్రిబ్యునల్‌ మన రాష్ట్రానికి కేటాయించిందన్నారు. ఈ జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా తెలుగు గంగ, ఎస్సార్‌బీసీ, గాలేరు–నగరి, చెన్నై తాగు నీటి పథకాలతో బాటు కేసీ కెనాల్‌ సప్లిమెంటేషన్‌కు నీళ్లు అందించాల్సి ఉందన్నారు. అయితే జలాశయంలో 854 అడుగులకు నీరు చేరితేనే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. 881 అడుగుల నీటి మట్టం ఉంటే గరిష్టంగా 44 వేల క్యూసెక్కుల నీటిని కాలువలకు మళ్లించడానికి అవకాశం ఉంటుందన్నారు.

ఆ స్థాయిలో నీటి మట్టం ఏటా సగటున పక్షం రోజులు కూడా ఉండటం లేదని వివరించారు. కాగా, 800 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నా పాలమూరు– రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా తెలంగాణ రోజుకు దాదాపు 3 టీఎంసీల నీటిని తరలించడానికి అవకాశం ఉందన్నారు. దీనికి తోడు 796 అడుగులకు లోపు నీటి మట్టం ఉన్నా ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా తెలంగాణ రోజు 4 టీఎంసీల నీటిని వాడుకుంటోందని ఆరోపించారు. దీని ఫలితంగా శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం వేగంగా తగ్గిపోతూ ఉండటంతో కేటాయింపులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ తమకు న్యాయంగా దక్కాల్సిన నీటిని కూడా వాడుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించి రాష్ట్రానికి న్యాయంగా కేటాయించిన నీటిని సద్వినియోగం చేసుకుని కరువు ప్రాంతమైన రాయలసీమకు తాగు నీటిని అందించాలనే ధ్యేయంతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ దిగువన కాలువలోకి నీటిని ఎత్తి పోయడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టాల్సి వచ్చిందని వివరించారు.  

మరిన్ని వార్తలు