రాయలచెరువుకు తప్పిన ముప్పు.. వారం తర్వాత ఇంటికెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

28 Nov, 2021 09:34 IST|Sakshi
రాయలచెరువు కట్టకు మరమ్మతులు పూర్తి కావడంతో పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

‘కట్ట’డి చేశారు 

55 వేల ఇసుక బస్తాలతో లీకేజీలకు అడ్డుకట్ట

చెన్నై, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు, ఇరిగేషన్‌ నిపుణుల సూచనలతో వంద శాతం ప్రమాద నివారణ

ఇక ఎంత వరదొచ్చినా ఇబ్బంది లేకుండా పక్కాగా పటిష్ట చర్యలు

వారం రోజులుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్కడే..

తిరుపతి రూరల్‌: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాలకు చెందిన 25 గ్రామాల ప్రజలకు వారం రోజులపాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన 500 ఏళ్ల నాటి రాయలచెరువుకు పూర్తిస్థాయిలో ముప్పు తప్పింది. వారం కిందట భారీ వరదలతో చెరువు కట్టకు ఏర్పడిన లీకేజీలకు 55 వేల ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లోని వేలాదిమంది ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం సాయంత్రం రాయల చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చదవండి: ఆ దిశగా మరో ముందడుగు.. సీఎం జగన్‌ ట్వీట్‌

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువు లీకేజీలను వందశాతం అరికట్టామని, పశువులతో సహా పునరావస కేంద్రాలకు వెళ్లిన దాదాపు 15 వేల మంది ప్రజలు తిరిగి ఇళ్లకు రావాలని పిలుపునిచ్చారు. లీకేజీలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించారని, ఆయన ఆదేశాల మేరకు చెన్నై, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు, ఇరిగేషన్‌ నిపుణులను పిలిపించి సమస్యను గుర్తించామన్నారు.

120 మంది నిపుణుల పర్యవేక్షణలో 453 మంది కార్మికులు వారం రోజులుగా రోజుకు 19 గంటలపాటు యుద్ధప్రతిపాదికన పనులు చేశారన్నారు. భారతీ సిమెంట్‌ యాజమాన్యం వితరణ చేసిన 35వేల ఖాళీ సంచులు, టీటీడీ నుంచి 20 వేల సంచుల్లో ఇసుక, క్వారీ డస్ట్‌ను కలిపి లీకేజీలు ఏర్పడిన ప్రదేశంలో బెర్మ్‌ పద్ధతిలో అరికట్టామని వివరించారు. నీటి ప్రవాహానికి ఈ బస్తాలు కొట్టుకుపోకుండా 700 టన్నుల బోల్డర్స్‌ (పెద్దపెద్ద బండరాళ్లు)ను వీటికి దన్నుగా ఉంచామన్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడినా కట్టకు ఇబ్బంది లేకుండా ఔట్‌ఫ్లో 8 వేల క్యూసెక్కులు వెళ్లే విధంగా ఏర్పాట్లుచేశామని చెవిరెడ్డి వెల్లడించారు.

ఏడు రోజుల తర్వాత ఇంటికి..
నిర్వాసితులు ఇంటికి వచ్చిన తర్వాతే తాను ఇంటికి వెళ్తానన్న చెవిరెడ్డి.. మొదటి రోజు నుంచి చెరువు కట్టపైనే బసచేసి చెరువు మరమ్మతు పనులను అనుక్షణం పర్యవేక్షించారు. అంతేకాక.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు నేవీ హెలికాప్టర్లలో నిత్యావసర సరుకులను అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో.. చెరువు లీకేజీలకు పూర్తిస్థాయిలో అడ్డకట్ట వేసిన తర్వాత స్థానికులందరూ ఇళ్లకు చేరుకున్నాక చెవిరెడ్డి శనివారం ఇంటికి వెళ్లారు.

మరిన్ని వార్తలు