శ్రీబాగ్‌ ఒప్పందం అమలు చేయాలంటూ మిలియన్‌ మార్చ్‌

1 Nov, 2022 13:18 IST|Sakshi

సాక్షి, కర్నూలు:  న్యాయ రాజధానికి మద్దతుగా రాయలసీమ జేఏసీ(నాన్‌ పొలిటికల్‌) ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలులో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. శ్రీబాగ్‌ ఒప్పందం అమలు చేయాలంటూ రాజ్‌విహార్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు కొనసాగిన ఈ మిలియన్ మార్చిలో మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, రాయలసీమ ఉద్యమకారులు పాల్గొన్నారు.

కాగా సీమ ముఖద్వారం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కోసం ఉద్యమం ఉధృతమవుతోంది. రాయలసీమ ఉద్యమకారులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు ఒక్కటై నినదిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధించుకోలేమని ఉద్యమబాట పడుతున్నారు. రాయలసీమకు 70 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయానికి న్యాయ రాజధానే సరైన పరిష్కారమని నమ్ముతున్నారు. 

కర్నూలును న్యాయ రాజధాని చేయాల్సిందే  
శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం వెనుకబడిన రాయలసీమకు న్యాయం చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకొచ్చారు. రాజధానుల వికేంద్రీకరణలో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. అందులో భాగంగా కర్నూలులో హైకోర్టుతోపాటు న్యాయ సంబంధిత సంస్థలన్నింటీని స్థాపించి  అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. అయితే కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వం రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకుంది.  రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వికేంద్రీకరణ  నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్‌ 18 నుంచి 23వ తేదీ వరకు న్యాయవాదులు  రిలే దీక్షలు చేపట్టారు.

నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కర్నూలులో తక్షణమే హైకోర్టును ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. అలాగే వారం రోజుల క్రితం వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించి ‘న్యాయ’ గళాన్ని వినిపించారు. అక్టోబర్‌ 30వ తేదీన రాయలసీమ జేఏసీ(నాన్‌ పొలిటికల్‌) ఆధ్వర్యంలో 129 ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించి కర్నూలులో వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో  వికేంద్రీకరణపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, ర్యాలీలు జరిగాయి. ప్రతి రోజూ ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక చోటా న్యాయ రాజధాని కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి.  

సీఎం వైఎస్‌ జగన్‌పై సంపూర్ణ నమ్మకం  
మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ టీడీపీ అమరావతికి జై కొట్టింది. దీంతో రాయలసీమ ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు అడ్డుపడుతున్న టీడీపీ నాయకులపై ఉద్యమకారులు ఆగ్రహంతో ఉన్నారు. శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం 2014లో రాయలసీమలో రా జధాని ఏర్పాటు చేయాలని, లేదంటే హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరితే చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు. ప్రస్తుతం కర్నూలును న్యాయ రాజధాని చేయాలనే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రిపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, త్వరలోనే తమ ఆకాంక్ష నెరవేరుతుందన్న ఆశాభావాన్ని  రాయలసీమ వాసులు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు