ఈనాడులో ఇంత విషమా? కూసింత బాబుగారి వైపు చూడరా?

5 Dec, 2022 09:23 IST|Sakshi

ఊహించిందే. ఎప్పటిలాగే విషపు రాతలు. సీమంతైనా మేలు చేశారా? అంటూ సీఎం జగన్‌ను, ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చంద్రబాబుకు కొమ్ముకాస్తూ కాకమ్మ కథలు రాసింది ఈనాడు . అఫ్‌కోర్స్‌.. అది కర్నూల్‌లో రాయలసీమ గర్జన  నేపథ్యంలో ఉక్రోశంతో రాసిందే!. కానీ. పరిస్థితులను ఒక్కసారి బేరీజూ వేసుకోవాలి కదా. ఆ మాత్రం సోయి లేకపోతే ఎలా? అన్నింటికి మించి తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దే చంద్రబాబు ఘనతను కూడా ఒక్కసారైన గుర్తించాలి కదా!. 

పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా చేసిన బాబు రాయలసీమ లోనే కాదు, రాష్ట్రంలో  ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసారా?.. ఇదీ ఈనాడు గుర్తించాల్సిన ప్రధానమైన విషయం. అంతెందుకు సొంత నియోజకవర్గం కుప్పంలోనే బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేకపోయాడు. మరి సీఎం జగన్‌.. ఆరు నెలల్లో హంద్రీ–నీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తి  చేస్తారు. బాబు హయాంలో కంటే.. సీఎం జగన్‌ హయాంలోనే ఇరిగేషన్‌ పనులు  ఊపందుకున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. అయినా ఇది జనమెరిగిన సత్యం.  

 వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక 2 సంవత్సరాలు కరోనా ఉంది అని మరిచిపోతే ఎలా?.. అయినా కూడా పరిస్థితులకు ఎదురొడ్డి పనులను త్వరగతిన పూర్తి చేసే యత్నం చేస్తున్నారు కదా.  ఓ.. బాబూ డైరెక్షన్‌ కదా.. అందుకే అవేమీ పేపర్‌కి ఎక్కవేమో!.

 ఇది పక్కన పెడితే.. రాయలసీమలో  శ్రీ సిటీ సంగతి ఏంటి? అది ఆనాడు మహానేత వైఎస్‌ఆర్‌ ప్రారంభించారు. ఇప్పుడు అది ఏపీ పరిశ్రమల కేంద్రంగా విరజిల్లుతోంది. అచ్చం శ్రీసిటీ లాగా .. కడప కొప్పర్తిని అభివృద్ధి చేస్తున్నారు జన నేత వైఎస్‌ జగన్. మరి చంద్రబాబు ఏం చేశాడు?.. సీమ లో పుట్టి సీమకు ద్రోహం చేయడం తప్పించి!.

► కరువు సీమగా పేరొందిన రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని, 2007-08లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల సామర్ద్యానికి పెంచడానికి చర్యలు చేపట్టారు. అప్పుడేం జరిగిందో ఈనాడుకు గుర్తు లేనట్లుంది. ఒకసారి గుర్తు చేద్దాం.. బాబుగారి(చంద్రబాబు)  ఆదేశాల మేరకు, యెల్లో పార్టీ నేతలు దేవినేని ఉమ చౌదరి , కోడెల శివప్రసాదరావు చౌదరి తదితరులు పెద్ద ఎత్తున విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. ధర్నా చేసి మరీ రాయలసీమకు వైఎస్ జలాన్ని మళ్లిస్తున్నారని, ఇది జలదోపిడీ అంటూ ఆందోళన చేశారు. మరొకటి చూద్దాం..

► మద్రాస్ లో వరదలు వచ్చినప్పుడు పక్కనే తిరుపతిలో పదివేల  ఉద్యోగాలు  కల్పన కోసం హెచ్‌సీఎల్‌ ఏర్పాటు చేస్తామ‌ని.. ఆ కంపెనీ చైర్మ‌న్ శివ‌నాడార్ తిరుమ‌ల‌కు వ‌చ్చిన సంద‌ర్బంలో ప్ర‌క‌టించారు. కానీ, సీఎంగా చంద్రబాబు చేసింది ఏంటి?.. శివ‌నాడార్‌పై ఒత్తిడి తెచ్చి తన అమరావతిలో పెట్టమని ఒత్తిడి చేయడమా?.

 కేంద్రం ఇచ్చిన అన్ని సంస్థల్లో ఉన్నతమైంది ఎయిమ్స్‌. ఆ ఎయిమ్స్‌ అనంతపురం నుంచి మంగళగిరికి తరలిపోయింది బాబుగారి దయవల్ల కాదా?

► శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం (నవంబర్‌ 16,1937) .. రాజధాని, హైకోర్టుల్లో ఏదో ఒకటి రాయలసీమకు ఇవ్వాలి. అందులో ఏం కావాలో కోరుకునే స్వేచ్ఛ సైతం రాయలసీమకుంది. కానీ చంద్రబాబు ఏం చేశాడు? అన్నీ అమరావతి లోనే పెట్టి మా వాళ్ళు మాత్రమే బాగుపడాలని కోరుకున్నాడు. పోనీ ఇవన్నీ పక్కనపెడితే.. 

► కాపు గర్జన సందర్భంగా అప్పుడు తునిలో రైలు తగలపడితే ఇది రాయలసీమ రౌడీల పని అని ప్రకటన ఇచ్చాడు చంద్రబాబు. మరి అరెస్ట్ చేసింది కోస్తా  కాపులను!. 

రాయలసీమ ద్రోహిగా బాబుగారు సాధించిన పై ఘనతలు.. బహుశా ఈనాడుకు, దాని అధినేత రామోజీరావు, మిగిలిన యెల్లో మీడియా పేపర్లు.. ఛానెల్స్‌ దృష్టిలో ఏనాటికీ పడవేమో!

మరిన్ని వార్తలు