‘రాయలసీమ ఎత్తిపోతల’ కొత్త ప్రాజెక్టు కాదు

5 Jan, 2021 04:56 IST|Sakshi

పాత ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడానికే ఈ పథకం

512 టీఎంసీల వాటాకు మించి చుక్క నీటిని అదనంగా వాడుకోం

వాటాకు మించి నీటిని తరలించే అవకాశమే ఉండదు

కృష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలని సీడబ్ల్యూసీ సూచించింది

విభజన చట్టం ప్రకారం అనుమతిచ్చి అపెక్స్‌ కౌన్సిల్‌కు పంపండి

కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి, డైరెక్టర్‌తో భేటీలో ఈఎన్‌సీ నారాయణరెడ్డి వినతి

డీపీఐని పరిశీలిస్తాం.. వారంలో మళ్లీ సమావేశమవుదాం : కృష్ణా బోర్డు

సాక్షి, అమరావతి: పాత ప్రాజెక్టులైన తెలుగుగంగ, శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ), గాలేరు–నగరి, కేసీ కెనాల్‌ ఆయకట్టుకు మెరుగ్గా నీటిని సరఫరా చేయడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని.. ఇది ఏ విధంగానూ కొత్త ప్రాజెక్టు కాదని.. కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం ఈ ఎత్తిపోతలకు అనుమతిచ్చి, అపెక్స్‌ కౌన్సిల్‌కు పంపాలని విజ్ఞప్తి చేసింది. దీంతో.. డీపీఐ (సమగ్ర ప్రాజెక్టు సమాచారం)ని పరిశీలిస్తామని.. వారం తర్వాత మరోసారి సమావేశమవుదామని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి రాయ్‌పురే చేసిన సూచనకు ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి అంగీకరించారు. కృష్ణా బోర్డు చైర్మన్‌ పరమేశం సెలవులో ఉన్నారని.. మళ్లీ సోమవారం సమావేశమవ్వాలని నిర్ణయించారు. 

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కృష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సూచన మేరకు సోమవారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు కార్యాలయానికి ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, కర్నూల్‌ జిల్లా ప్రాజెక్టŠస్‌ సీఈ మురళీనాథ్‌రెడ్డి వెళ్లారు. బోర్డు చైర్మన్‌ పరమేశం సెలవులో ఉండటంతో సభ్య కార్యదర్శి రాయ్‌పురే, డైరెక్టర్‌ హెచ్‌కే మీనాలతో వారు భేటీ అయ్యారు. విభజన చట్టం ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతివ్వాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతలను కొత్త ప్రాజెక్టుగా తెలంగాణ సర్కార్‌ చెబుతోందని బోర్డు సభ్య కార్యదర్శి రాయ్‌పురే లేవనెత్తడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ట్రిబ్యునల్, విభజన చట్టం ద్వారా ఎస్సార్బీసీ, తెలుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌కు నీటి కేటాయింపులు ఉన్నాయని గుర్తుచేశారు.

శ్రీశైలం రిజర్వాయర్‌లో 881 అడుగుల కంటే ఎక్కువ నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ (పీహెచ్‌ఆర్‌) నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ద్వారా ఈ ప్రాజెక్టులకు ప్రస్తుతమున్న డిజైన్‌ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించవచ్చునని.. కానీ, ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి 15 నుంచి 20 రోజులకు మించి ఉండదని వారు వివరించారు. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులు ఉంటే పీహెచ్‌ఆర్‌ ద్వారా శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి ఏడు వేలు, 841 అడుగుల నీటిమట్టం ఉంటే రెండు వేల క్యూసెక్కులు మాత్రమే చేరుతాయని.. అదే 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీరు కూడా కాలువలోకి చేరదన్నారు.

ఇతర ప్రాజెక్టుల ఆయకట్టుకు విఘాతం కలగదు
రాయలసీమ ఎత్తిపోతలవల్ల తమ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తెలంగాణ ఫిర్యాదు చేసిందని బోర్డు సభ్య కార్యదర్శి రాయ్‌పురే ప్రస్తావించగా.. వాటిని ఈఎన్‌సీ నారాయణరెడ్డి కొట్టిపారేశారు. విభజన చట్టం ప్రకారం కల్వకుర్తి ఎత్తిపోతలకు మాత్రమే అనుమతి ఉందని, మిగిలిన ప్రాజెక్టులకు అనుమతిలేదని గుర్తుచేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంవల్ల ఏ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు విఘతం కలగదన్నారు. దీంతో డీపీఐని సమగ్రంగా పరిశీలిస్తామని.. సోమవారం మరోసారి సమావేశమవుదామని రాయ్‌పురే చేసిన సూచనకు ఈఎన్‌సీ అంగీకరించారు.

కేంద్ర కార్యాలయాలన్నీ విశాఖలోనే
కేంద్ర ప్రభుత్వరంగ కార్యాలయాలన్నీ విశాఖలోనే ఉన్నాయని.. కృష్ణా బోర్డు కార్యాలయాన్నీ అక్కడే ఏర్పాటుచేస్తామని ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి చెప్పారు. కృష్ణా బోర్డు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు ఏపీలోనే ఉండాలన్నారు. అక్టోబర్‌ 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌లో కృష్ణా బోర్డును ఏపీకి తరలించాలని నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. ఇక చట్ట ప్రకారం అన్ని అనుమతులతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడతామని ఈఎన్‌సీ స్పష్టం చేశారు.  

ఏటా నీటి మట్టం 800 అడుగులకు తగ్గుతోంది..
మరోవైపు.. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం నుంచే సాగునీటి ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా రోజుకు ఏడు టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉందని.. కృష్ణా బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏటా నీటిని తరలిస్తోందని.. దీనివల్ల నీటి మట్టం 800 అడుగులకు తగ్గిపోతోందని ఈఎన్‌సీ నారాయణరెడ్డి సమావేశంలో ప్రస్తావించారు. కానీ, కేటాయింపులున్నా సరే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌కు ఏపీలో నీళ్లందించలేని దుస్థితి నెలకొందని.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నామని ఆయన వివరించారు. ఈ పరిస్థితి దృష్ట్యా  శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీలను పీహెచ్‌ఆర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా ‘రాయలసీమ’ పథకాన్ని చేపట్టామన్నారు. పీహెచ్‌ఆర్‌కు దిగువన కాలువలో 5 కి.మీ వద్ద కృష్ణా బోర్డు టెలీమీటర్లు ఏర్పాటుచేసిందని.. వీటి ద్వారా ఎత్తిపోతల ద్వారా తరలించే ప్రతి నీటి బొట్టునూ లెక్కించవచ్చన్నారు. 

మరిన్ని వార్తలు