సంక్షేమానికి దీటుగా అభివృద్ధి

6 Dec, 2021 02:26 IST|Sakshi

బడ్జెట్‌ కేటాయింపులు, వ్యయంపై ఆర్‌బీఐ విశ్లేషణాత్మక నివేదిక

మూడేళ్లగా  ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమంపై వ్యయం పెరుగుదల

భారీగా పెరిగిన ఉద్యోగుల జీత భత్యాల వ్యయం 

గతంలో చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపులు అదనపు భారం 

సాక్షి, అమరావతి: సంక్షేమం, అభివృద్ధే గీటురాయిగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులు, వ్యయం చేస్తోందని రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) విశ్లేషించింది. 2019 – 20 నుంచి వరుసగా పరిశీలిస్తే అభివృద్ధి  వ్యయం ఏటా పెరుగుతోందని ఆర్బీఐ నివేదికతో స్పష్టమవుతోంది. అభివృద్ధి వ్యయం 2020–21తో పోల్చితే 2021–22లో ఏకంగా 33.5 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. సామాజిక రంగాల వ్యయం కూడా భారీగా పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. బడ్జెట్‌ కేటాయింపులు, వ్యయాలపై ఆర్బీఐ విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. ఇక 2019–20 నుంచి ఉద్యోగుల జీతభత్యాలు బాగా పెరిగాయని, అలాగే గతంలో చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపులూ అధికమయ్యాయని నివేదిక పేర్కొంది. గత రెండేళ్లగా ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమంపై వ్యయం పెరిగిందని తెలిపింది.  

పెరిగిన జీతభత్యాల పద్దు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 27 శాతం మధ్యంతర భృతి పెంచారు. వైద్య ఆరోగ్య రంగంలో పెద్ద ఎత్తున శాశ్వత ఉద్యోగాలను కల్పించడంతో పాటు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తెచ్చారు. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న చిరు ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచారు. దీంతో జీత భత్యాల పద్దు భారీగా పెరిగింది. గత సర్కారు హయాంలో 2018–19లో ఉద్యోగుల జీతభత్యాల పద్దు రూ.32,743.40 కోట్లు ఉండగా 2021–22లో అది రూ.50,662.20 కోట్లకు చేరిందని ఆర్బీఐ నివేదిక తెలిపింది.

సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి, ఆహారం నిల్వ తదితర రంగాల వ్యయం 2019–20లో మొత్తం బడ్జెట్‌లో 45.4 శాతం ఉండగా 2021–22లో 49.4 శాతానికి పెరిగింది. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమంపై గత మూడు సంవత్సరాలుగా బడ్జెట్‌లో వ్యయం పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. 2019–20లో బడ్జెట్‌లో ఈ రంగంపై 4.3 శాతం వ్యయం చేయగా 2020–21లో 5.2 శాతం వ్యయం చేసినట్లు తెలిపింది. 2021–22లో 6.1 శాతం మేర కేటాయింపులు చేసినట్లు వెల్లడించింది.

అభివృద్ధికే ఎక్కువ వ్యయం
ప్రధాన ఆర్థిక సూచికల ప్రకారం చూస్తే మూడు ఆర్ధిక సంవత్సరాల్లో అభివృద్ధియేతర వ్యయం కన్నా అభివృద్ధికే ఎక్కువ వ్యయం చేస్తున్నట్లు ఆర్‌బీఐ అధ్యయన నివేదిక 
తెలిపింది.  

మరిన్ని వార్తలు