RBI Report: శ్రమజీవికి సంతోషం.. ఏపీలో కూలీల వేతనాలు పెరుగుదల..

28 Nov, 2021 09:16 IST|Sakshi

గ్రామీణ కూలీల వేతనాలు పెరుగుదల

రాష్ట్రంలో గత రెండేళ్లలో ఇవి పెరిగినట్లు ఆర్‌బీఐ వెల్లడి

కేరళలో వ్యవసాయ కూలీల వేతనాలు అత్యధికం

అత్యల్పంగా గుజరాత్‌లో..

సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర, నిర్మాణ రంగ కూలీల వేతనాలు పెరిగాయి. ఉద్యాన కూలీల వేతనాల్లోనూ ఈ పెంపు నమోదైనట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన తాజా నివేదికలో వెల్లడించింది. అయితే, దేశంలో గ్రామీణ వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కూలీల వేతనాలు కేరళలో అత్యధికంగా ఉంటే అత్యల్పంగా గుజరాత్‌లో ఉండటం గమనార్హం.

చదవండి: ఎగసిన ఎగుమతులు.. ఏపీ నుంచి భారీగా ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు 

ఇక రాష్ట్రంలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.300లోపే ఉంటే 2019–20 నుంచి ఇది రూ.300 దాటింది. అలాగే, వ్యవసాయేతర కూలీల రోజు వారీ వేతనం కూడా చంద్రబాబు హయాంలో రూ.300లోపే ఉంటే 2020–21లో ఆ మొత్తం దాటింది. జాతీయ స్థాయి కూలీల సగటు వేతనం కన్నా రాష్ట్రంలోని కూలీల వేతనం ఎక్కువగా ఉంది. అలాగే, జాతీయ స్థాయి విషయానికొస్తే 2019–20లో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.287.1లు ఉంటే రాష్ట్రంలో అది రూ.302.6గా ఉంది. అలాగే, 2020–21లో జాతీయ స్థాయిలో కూలీల రోజువారీ సగటు వేతనం రూ.309.9 ఉంటే.. రాష్ట్రంలో రూ.318.6లు గా ఉంది.

మరిన్ని వార్తలు