ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ దిశగా ఆర్బీకేలు, అగ్రి ల్యాబ్స్‌ అడుగులు

27 Feb, 2022 05:15 IST|Sakshi
ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ పొందిన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం ఉండూరు–2 ఆర్బీకే

ఇప్పటికే 7 ఆర్బీకేలకు ఐఎస్‌వో గుర్తింపు

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్బీకేలు, అగ్రి ల్యాబ్స్‌

అవినీతికి ఆస్కారం లేని రీతిలో నాణ్యమైన సేవలు

డిసెంబర్‌ నాటికి అన్ని ఆర్బీకేలు, అగ్రి ల్యాబ్స్‌కు ఐఎస్‌వో సర్టిఫికేషన్‌!

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌కు దశల వారీగా ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి అత్యాధునిక సౌకర్యాలతో నూతన భవన సముదాయాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్మాణం పూర్తయి పూర్తి స్థాయిలో సేవలందిస్తున్న ఆర్బీకేల్లో  జిల్లాకు ఒకటి చొప్పున ఐఎస్‌వో గుర్తింపు కోసం దరఖాస్తు చేయగా.. 7 ఆర్బీకేలకు ఇటీవలే ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ లభించింది. తొలి విడతలో దరఖాస్తు చేసిన మరో 6 ఆర్బీకేలను ఇటీవలే ఐఎస్‌వో ప్రతినిధుల బృందం పరిశీలించి వెళ్లింది. వీటికి వచ్చే నెల మొదటి వారంలో ఐఎస్‌వో గుర్తింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన ఆర్బీకేలకు దశల వారీగా ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. 

అగ్రి ల్యాబ్స్‌కూ దశల వారీగా దరఖాస్తు
మరోవైపు నియోజకవర్గ, జిల్లా, రీజనల్, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌కు కూడా దశల వారీగా ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ సాధించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యతను పరీక్షించేందుకు నియోజకవర్గ స్థాయిలో 147 ల్యాబ్‌లతో పాటు 4 రీజనల్‌ కోడింగ్‌ సెంటర్లు, డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో రాష్ట్రస్థాయి ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 70 ల్యాబ్స్‌ అందుబాటులోకొచ్చాయి. వీటికి అనుబంధంగానే పాడి, ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మత్స్య శాఖకు సంబంధించి 35 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 35 వాటర్‌ సాయిల్‌ ఎనాలసిస్, 35 మైక్రో బయాలజీ, 14 ఫీడ్‌ ఎనాలసిస్, 17 పీసీఆర్, 13 క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. పశు సంవర్ధక శాఖకు సంబంధించి 154 ఇంటిగ్రేటెడ్‌ వెటర్నరీ ల్యాబ్స్, జిల్లా స్థాయిలో 10, రీజనల్‌ స్థాయిలో 4, పులివెందులలో  రిఫరల్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 60 ల్యాబ్స్‌లో సేవలు అందిస్తున్నారు. 

దశల వారీగా అన్నిటికీ..
ఇప్పటికే ఏడు ఆర్బీకేలకు ఐఎస్‌వో గుర్తింపు లభించింది. త్వరలో మరో ఆరు ఆర్బీకేలకు గుర్తింపు రానుంది.  ఇదే రీతిలో మిగిలిన ఆర్బీకేలతో పాటు వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌కు కూడా ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ సాధించే దిశగా కృషి చేస్తున్నాం.
    – పూనం మాలకొండయ్య, స్పెషల్‌ సీఎస్‌ 

మరిన్ని వార్తలు