ఆటోడ్రైవర్‌తో పరిచయం; ప్రియుడితో కలసి భర్త హత్య  

17 Dec, 2020 09:15 IST|Sakshi
ప్రమాదంలో మృతి చెందిన నారాయణమ్మ

సాక్షి, మహానంది (కర్నూలు): ‘బాగా చదువుకో.. ఆరోగ్యం జాగ్రత్త.. ఏమైనా అవసరమైతే ఫోన్‌ చేయి’ అంటూ బిడ్డకు మంచి మాటలు చెప్పి వెనుదిరిగిన ఆ తల్లి కాసేపటికే అనంతలోకాలకు చేరుకుంది. టైర్‌ పంక్చర్‌ కావడంతో బైక్‌ అదుపుతప్పి కిందపడిన ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ విషాదకర ఘటన మహానంది మండలం నందిపల్లె వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన నారాయణమ్మ, శ్రీను కుమార్తె లావణ్య పాణ్యం మండలం నెరవాడలోని గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కూతురిని చూసేందుకని ఉదయం బైక్‌పై వచ్చారు. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వెనుదిరిగారు. మార్గంమధ్యలో నందిపల్లె సమీపంలోకి చేరుకోగానే బైకు టైరుకు మేకు గుచ్చుకుని పంక్చర్‌ అయింది. వెనుక కూర్చున్న నారాయణమ్మ ఒక్కసారిగా జారి కిందపడటంతో చెవులు, ముక్కుల నుంచి రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. హెడ్‌ కానిస్టేబుల్‌ విజయ్‌కుమార్, రోడ్‌ సేఫ్టీ సిబ్బంది రసూలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.  చదవండి: భూమి ఇస్తేనే.. తలకొరివి పెడతా..! 

అడ్డుగా ఉన్నాడనే కడతేర్చింది
పట్నంబజారు(గుంటూరు): అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, ప్రియుడితో కలసి భర్తను కడతేర్చిన భార్యను పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచారు. అరండల్‌పేట పోలీసుస్టేషన్‌ వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ కె. సుప్రజ, స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసం ఉండే పి.కె.మరియదాసు (40) మార్చుల్‌ పని చేస్తాడు. అతడికి 22 ఏళ్ల కిందట మరియమ్మతో వివాహం జరగగా, ఇద్దరు సంతానం ఉన్నారు. కుమార్తెకు వివాహం అవ్వగా, కొడుకు సుధాకర్‌ మిర్చి యార్డులో పని చేస్తున్నాడు.  కుమార్తె వేమూరులో ఉంటుండగా మరియమ్మ అక్కడకు వెళ్లి వస్తూ ఉండేది. ఈ క్రమంలో పెరవలి గ్రామానికి చెందిన గుంటూరు అనిల్‌బాబు అనే ఆటోడ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్దికాలానికి విషయం తెలుసుకున్న భర్త మరియదాసు భార్య మరియమ్మను హెచ్చరించడం ప్రారంభించారు. నిత్యం మద్యం తాగి వేధిస్తుండటంతో, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని ప్రియుడితో కలసి పథకం వేసింది. (చదవండి: డబ్బుల కోసం వేధించి.. గొంతు నులిమి చంపేశాడు)


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సుప్రజ, ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరావు  

ఈనెల 7వ తేదీ రాత్రి 1గంట సమయంలో కుమారుడు  మిర్చి యార్డుకు పనికి వెళ్లిన తరువాత, అనిల్‌బాబు, మరియమ్మలు కలసి మరియదాసు గొంతుకు తాడును బలంగా బిగించి, రోకలి బండతో కొట్టి హత్య చేశారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. తర్వాత కుమారుడు సుధాకర్‌కు ఫోన్‌ చేసి తండ్రి మరియదాసు ఫూటుగా మద్యం తాగి ఎక్కడో పడి గాయపడ్డాడని చెప్పి అక్కడ నుంచి పరారయ్యారు. సుధాకర్‌ బంధువులకు సమాచారాన్ని అందించాడు. అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు కాంతారావు విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పక్కాగా హత్య జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం రాజీవ్‌గాం«దీనగర్‌కు చెందిన వలంటీర్‌ ద్వారా ఇద్దరు నిందితులు నేరాన్ని అంగీకరించి, పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. ఈ మేరకు వారిని అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లు, రోకలిబండ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు