Vizag Beach Black Sand: నల్లని రంగులో విశాఖ సాగర తీరం.. ఎందుకిలా? 

20 Aug, 2022 15:44 IST|Sakshi

బ్లాక్‌ శాండ్‌తో కళావిహీనం 

మురుగు నీరు, బొగ్గు, ఇనుప రజను వ్యర్థాలే కారణం 

నిన్న తీరం కోత.. నేడు నలుపు రంగులోకి మారిన ఇసుక 

పర్యాటకులను నిరాశ పరుస్తున్న సాగరతీరం

విశాఖ సాగరతీరం అంటే బంగారు వర్ణంతో కనిపించే ఇసుక తిన్నెలు.. సముద్రపు నీటితో శుద్ధి చేశారా? అన్నంతగా స్వచ్ఛతను తలపించే ఒంపులు తిరిగిన చిన్న చిన్న ఇసుక దిబ్బలు.. వాటిని ఎంత సేపు చూసినా, వాటిపై మరెంత సేపు సేద తీరినా తనివి తీరని అనుభూతిని పొందుతారు పర్యాటక ప్రియులు. అలాంటి విశాఖ బీచ్‌ ఇటీవల తన సహజ సౌందర్యానికి భిన్నంగా కనిపిస్తోంది. సుందర సాగరతీరం ఒంటికి మసి పూసుకున్నట్టు అగుపిస్తోంది. ఔరా! ఇది మన విశాఖ బీచేనా? అనిపించేలా రూపు మారిపోయింది. 
– సాక్షి, విశాఖపట్నం

సాక్షి, విశాఖపట్నం: కోస్టల్‌ బ్యాటరీ నుంచి వుడా పార్క్‌ వరకు బీచ్‌ ఎక్కడ చూసినా నల్లని ఇసుకను పరుచుకున్నట్టు దర్శనమిస్తోంది. ఇది సాగరతీరానికి వచ్చే సందర్శకులు, పర్యాటక ప్రేమికులకు తీవ్ర నిరాశను మిగిలిస్తోంది. విశాఖ బీచ్‌ను చూడడానికి ఎక్కడెక్కడ నుంచో నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇసుక తిన్నెలపై కూర్చుని తీరం వైపు నురుగలు కక్కుతూ వచ్చే కెరటాలను చూస్తూ మైమరచి పోతుంటారు. కొద్ది రోజుల నుంచి ఆ పరిస్థితి లేదు.

ఇసుకంతా మురుగు పులుముకున్నట్టు ఉండడంతో బీచ్‌లో కూర్చుని అలలను ఆస్వాదించడానికి వీలు పడడం లేదు. దీంతో బీచ్‌కు వచ్చే సందర్శకుల్లో పలువురు మునుపటిలా కూర్చోకుండా నిలబడే ఉంటున్నారు. బీచ్‌ రోడ్డుకు అనుకుని ఉన్న గోడపై కొందరు, తీరంలో కొబ్బరిచెట్ల మధ్య ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలపై మరికొందరు సేద తీరుతున్నారు. అలా అలలకు అల్లంత దూరం నుంచే బీచ్‌ అందాలను అరకొరగా ఆస్వాదిస్తున్నారు. దీంతో నిత్యం సందర్శకుల రద్దీతో కళకళలాడుతూ కనిపించే సాగరతీరం కళా విహీనంగా కనిపిస్తోంది.  

ఎందుకిలా? 
కొద్ది రోజుల క్రితం నుంచి సాగరతీరం కోతకు గురవుతోంది. ఈ పరిణామమే సందర్శకులకు ఇబ్బందికరంగా ఉంది. అది చాలదన్నట్టు ఇప్పుడు ఇసుక నలుపు రంగును పులుముకుంటోం ది. ఈ పరిస్థితికి సముద్రంలోకి నగరం నుంచి మురుగు నీరు వదిలిపెట్టడం, పోర్టులో బొగ్గు లోడింగ్, అన్‌లోడింగ్‌తో పాటు ఇనుప రజను వంటివి కారణమని సముద్ర అధ్యయన నిపుణులు చెబుతున్నారు. సంవత్సరంలో ఏడెనిమిది నెలలు నగరంపైకి నైరుతి గాలులే వీస్తాయి. విశాఖ నగరానికి నైరుతి దిశలోనే అనేక పరిశ్రమలున్నాయి. వాటి నుంచి విడుదలయ్యే కాలుష్య వ్యర్థాలు కూడా సముద్రంలోనే కలుస్తున్నాయి. ఇవన్నీ సముద్రం అడుగున ఉంటాయి.

అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడినప్పుడు కడలి కల్లోలంగా మారుతుంది. దీంతో దిగువన ఉన్న ఈ వ్యర్థాలు పైకి, కిందకు కలుషితమవుతాయి. కెరటాల ఉధృతితో అవి ఇసుకతో సహా తీరానికి కొట్టుకు వస్తాయి. ఫలితంగా అప్పటివరకు తీరంలో గోధుమ, బంగారు వర్ణంలో ఉన్న ఇసుక నల్లగా మసి పూసినట్టుగా మారిపోతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం ప్రొఫెసర్‌ ఈడ్పుగంటి ధనుంజయరావు ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం బీచ్‌లో ఇసుక నలుపు రంగులోకి మారిపోవడానికి ఇదే కారణమని తెలిపారు. కొద్దిరోజుల్లో మళ్లీ ఈ నల్లని ఇసుక కెరటాల ఉధృతికి వెనక్కి సముద్రంలోకి వెళ్లిపోతుందని, అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని వివరించారు.

మరిన్ని వార్తలు