ఆరోగ్యశ్రీతో బాలుడికి పునర్జన్మ

18 Oct, 2022 05:10 IST|Sakshi
బాలుడి కుటుంబ సభ్యులతో పీడియాట్రిక్‌ సర్జన్‌ సుకుమార్‌

వైఎస్సార్‌ జిల్లా బీరాన్‌ఖాన్‌పల్లెకు చెందిన బాలుడికి అరుదైన సమస్య

పుట్టుకతో మల విసర్జన ద్వారం ఏర్పడకపోవడంతో ఇబ్బందులు

లక్షలాది రూపాయలు అవసరమవ్వడంతో తల్లిదండ్రుల ఆందోళన

ఆరోగ్యశ్రీతో ఉచితంగా సర్జరీ చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

కడప రూరల్‌: ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదిస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ తాజాగా ఓ పేద కుటుంబానికి చెందిన చిన్నారికి అండగా నిలిచింది. వైఎస్సార్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బీరాన్‌ఖాన్‌పల్లెకు చెందిన షేక్‌ నూర్‌బాషా, చాందిని దంపతుల కుమారుడు హబీబ్‌(2)కు పుట్టుకతో మల విసర్జన ద్వారం ఏర్పడలేదు. ఈ సమస్య 5 వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో.. హబీబ్‌ తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

ఏరోజుకారోజు పనికి వెళ్తే గానీ జీవితం గడవని పరిస్థితుల్లో కుమారుడికి వైద్యమెలా చేయించాలా అని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇంతలో ఈ జబ్బుకు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని వైద్యులు చెప్పడంతో.. ఎంతో సంతోషించిన వారు వెంటనే తమ కుమారుడిని  కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మొదటి దశ సర్జరీ చేసి.. పెద్ద పేగును తీసి బయటకు పెట్టారు. ఆ తర్వాత కడపలోని కేసీహెచ్‌ ఆస్పత్రిలో కూడా దీనికి చికిత్స చేస్తారని తెలియడంతో అందులో చేర్పించారు.

అక్కడి పీడియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సుకుమార్‌ పర్యవేక్షణలో వైద్య సిబ్బంది ఇటీవల రెండో సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. రూ.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్స.. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా పూర్తవ్వడంతో హబీబ్‌ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా తమ కుమారుడికి పునర్జన్మ లభించిందని.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామంటూ వారు కృతజ్ఞతలు తెలిపారు.  

మరిన్ని వార్తలు