అనుభవజ్ఞులకు అగ్రపీఠం

12 Apr, 2022 16:25 IST|Sakshi

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సమప్రాధాన్యం లభించింది. పాలనలో అనుభవజ్ఞులకు మంత్రి పదవులను సీఎం కట్టబెట్టారు. ‘సామాజిక’ న్యాయం పాటించారు. విద్యల నగరానికి చెందిన బొత్స సత్యనారాయణకు విద్యాశాఖ కేటాయించి సముచిత స్థానం కల్పించగా, గిరిపుత్రుడైన పీడిక రాజన్నదొరకు గిరిజన సంక్షేమశాఖ కేటాయించారు. డిప్యూటీ సీఎంగా గౌరవహోదానిచ్చారు. మంత్రివర్గం కొలువుదీరిన వేళ జిల్లాల్లో ‘కొత్త’ సందడి నెలకుంది.  

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యల నగరానికి అరుదైన గౌరవం దక్కింది. జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా సోమవారం ప్రమాణస్వీకరం చేశారు. ఆయన ఇప్పటికే విద్యారంగ అభివృద్ధిలో తనముద్ర వేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జేఎన్‌టీయూ–విజయనగరం కళాశాలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాడు తండ్రి వైఎస్సార్‌ మంత్రివర్గంలోనే కాదు ఇప్పుడు తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాబినెట్‌లోనూ రెండోసారి చోటు సంపాదించారు. ఆయన హయాంలో విద్యల నగరానికి మరోసారి మహర్దశ పడుతుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. జిల్లాలో విద్యాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.   

వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాం నుంచి వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ ఈసారి తొలిసారిగా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంతవరకు ఏ శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ జిల్లా కేంద్రానికున్న విద్యలనగరం పేరును నిలబెట్టడానికే ప్రయత్నించేవారు. ఆ దిశగా తీర్చిదిద్దడానికి విశేష కృషి చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఒకటి జిల్లాకు తెప్పించుకోవడంలో బొత్స ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆ కళాశాలనే ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి యూనివర్సిటీగా ప్రకటించారు. ఇందులో బొత్స సఫలమయ్యారు.

ప్రస్తుతం 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశ్వవిద్యాలయానికి మరో 80 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతానని బొత్స ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. యూనివర్శిటీ ప్రకటించి కొన్ని నెలలు అయినప్పటికీ జేఎన్‌టీయూ–కాకినాడ యూనివర్సిటీ నుంచి విభజన ప్రక్రియ మొదలుకాలేదు. యూనివర్సిటీకి  వైస్‌ చాన్స్‌లర్‌ పోస్టు భర్తీ చేయాల్సి ఉంది. బొత్స విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో అవన్నీ సాఫీగా పూర్తవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల... 
టీడీపీ గత తొమ్మిదేళ్ల పాలనలో విజయనగరం స్థానికులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గురించి పట్టించుకోలేదు. 70 శాతం వరకు మధ్యతరగతి కుటుంబాలున్న విజయనగరం జిల్లాకేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఉండాలని బొత్స సత్యనారాయణే గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధించారు. వైఎస్సార్‌ తొలి ఐదేళ్ల పాలనలోనే ఈ కళాశాల మంజూరైంది. ప్రస్తుతం స్థానిక కస్పా మున్సిపల్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో కళాశాలను నిర్వహిస్తున్నారు. కళాశాలకు పక్కా భవనాల నిర్మాణం కోసం నగర నడిబొడ్డున ఉన్న రాజీవ్‌నగర్‌ సమీపాన మున్సిపల్‌ స్థలాన్ని కేటాయించడం కోసం ప్రయత్నాలు జరిగాయి. ఈసారి అది ఫలించే అవకాశం ఉంది. 

ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌... 
విజయనగరం పట్టణ శివారులోని ఉన్న ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్‌ విస్తరణ కోసం శివారు ప్రాంతంలో 200 ఎకరాల భూమిని కూడా బొత్స సత్యనారాయణ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఒప్పించి మంజూరు చేయించారు. అంతవరకు పట్టణంలో చిన్నచిన్న అద్దె భవనాల్లో ఉన్న ఈ క్యాంపస్‌ కోసం రూ.5 కోట్లు నిధులు కూడా సాధించారు. అలా పక్కా భవనాన్ని నిర్మించారు.  

స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కళాశాల కావాలి...  
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంపొందించే దిశగా విద్యారంగంలో ప్రభుత్వం పలు సంస్కరణలను తలపెట్టింది. అందులో  భాగంగా రాష్ట్రంలో వినూత్నంగా స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలా ఒక కళాశాలను విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ మంత్రిగా వేగవంతం చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తగిన స్థలం కోసం జిల్లా కేంద్రంలో పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాల ప్రాంగణంలో స్థలాన్ని ఎంపిక చేశారు. అయితే ఆ స్థలాన్ని ప్రభుత్వం ఇంకా నిర్ధారించలేదు.

ఆమోదయోగ్యం  
పాలనా సంస్కరణల్లో భాగంగా సీఎం చేపట్టిన కొత్త మంత్రి వర్గం కూర్పు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. ముఖ్యంగా అధికంగా ఉన్న బీసీలకు మంచి ప్రాధాన్యమిచ్చారు. బొత్స సత్యనారాయణ సీనియారిటీ, సిన్సియారిటీని సీఎం గుర్తించారు. ఆయనను మళ్లీ మంత్రివర్గంలో చేర్చినందుకు కృతజ్ఞతలు. 
– అప్పికొండ రవికుమార్, న్యాయవాది, నెల్లిమర్ల   

సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు
మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించిన సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. కొప్పులవెలమ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడు, పోలినాటి వెలమలకు చెందిన ధర్మాన ప్రసాదరావు, తూర్పుకాపుల్లో ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ, ఎస్టీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, వైశ్యసామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి పదవులు కేటాయించడం హర్షణీయం.                
– నెక్కల నాయుడుబాబు, చైర్మన్, కొప్పుల వెలమ కార్పొరేషన్‌  

సామాజిక న్యాయం..  
పదవుల కేటాయింపులో పూర్తిస్థాయిలో సామాజిక న్యాయాన్ని పాటించారు. కొత్తమంత్రివర్గం కూర్పు బాగుంది. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగనుంది.  
– కనకల చంద్రరావు ఎస్జీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు 

బడుగు వర్గాలకు ప్రాధాన్యం  
మంత్రి పదవుల కేటాయింపులో బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం దక్కింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అగ్రపీఠం వేశారు.   
   – వి.నాగేశ్వరరావు, వ్యవసాయ సలహామండలి జిల్లా చైర్మన్, బూర్జ, సీతానగరం మండలం

 బడుగు బలహీనుల రాజ్యం 
జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తొలిసారి మంత్రివర్గంలోనే ఆ దిశగా మంత్రి పదువులు అత్యధికంగా ఇచ్చారు. ఈ సారి మంత్రివర్గ విస్తరణలో కూడా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ పదవులు ఇచ్చి దేశంలో ఏ రాష్ట్ర పాలకులు తీసుకోని వీరోచిత నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో గొప్ప సంస్కరణకర్తగా నిలిచారు.  
– కొరుపోలు సత్యారావు, అవార్డీ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు