శాంతిభద్రతలు భేష్‌

28 May, 2023 04:33 IST|Sakshi

భయం వీడిన రాష్ట్ర ప్రజలు.. ప్రశాంత జీవనం 

పోలీసు శాఖ వ్యవస్థాగతంగా బలోపేతం.. నేరాల కట్టడికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం 

విజయవంతమైన ఆపరేషన్‌ పరివర్తన్‌ 

గంజాయి దందాకు చరమగీతం 

సారా దందాలపై ఉక్కుపాదం..  సైబర్‌ నేరాలకు కళ్లెం 

రాష్ట్రంలో తగ్గిన  నేరాలు–పెరిగిన భద్రత 

జాతీయ స్థాయిలో ఏపీ పోలీసు శాఖకు గుర్తింపు  

సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయికి పోలీసు వ్యవస్థ.. స్నేహపూర్వక పోలీసు విధానం..  దశాబ్దాలుగా బ్రహ్మపదార్థంగా అంతుచిక్కకుండా ఉన్న ఈ రెండు లక్ష్యాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాధించి చూపించింది. అందుకోసం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. విధానపరంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. శాంతిభద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయి.

ప్రజలు భయ పడకుండా, శాంతి భద్రతలతో జీవించేలా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దింది. అక్రమ వ్యాపారాల నిరోధానికి కొత్తగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)ని నెలకొల్పింది. దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన గంజాయి సాగును కూకటివేళ్లతో సహా పెకలించివేసింది. నాటు సారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్రంలో నేరాల కట్టడికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు, అల్లర్లు గణనీయంగా తగ్గాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలే చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో 36 అవార్డులు సాధించడం రాష్ట్ర పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం.

వ్యవస్థాగతంగా బలోపేతం
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. జిల్లాల పునర్విభజనతో 13 జిల్లా పోలీసు కార్యాలయాలు 26కు పెరిగాయి. క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థ బలోపేతానికి కొత్తగా 16 సబ్‌ డివిజన్లు, 19 పోలీసు సర్కిళ్లను ఏర్పాటు చేసింది. 2019కు ముందు 98 సబ్‌ డివిజన్లు ఉండగా ఇప్పుడు 114కు పెరిగాయి. 2019కు ముందు 197 పోలీస్‌ సర్కిళ్లు ఉండగా ప్రస్తుతం 216కు చేరాయి.

ఇక  ఏడాదికి 6,500 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 6,511 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. దేశంలోనే విప్లవాత్మక రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసులను నియమించి క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణకు కొత్త వ్యవస్థను సృష్టించింది.

రాష్ట్రంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను జియో ట్యాగింగ్‌ చేసి గస్తీ విధులు కేటాయిస్తోంది. అసాంఘిక శక్తులను ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్‌ నిర్వహించడం, రౌడీషీట్లు తెరవడం మొదలైన చర్యలతో నేరాలకు ఆస్కారం లేకుండా చేస్తోంది. 

ఎస్సీ, ఎస్టీలకు మెరుగైన భద్రత
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిపై దాడులు, వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాడులు, వేధింపుల కేసుల్లో తక్షణం ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నాయి.

దర్యాప్తు వేగంగా చేస్తూ త్వరితగతిన చార్జిషీట్లు దాఖలు చేస్తోంది. దాంతో గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వేధింపుల కేసులు గణనీయంగా తగ్గాయి. 2019లో 2,382 కేసులు నమోదు కాగా 2022లో 2,229 కేసులకు తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో 15 శాతం కేసులు తగ్గాయి. 

గంజాయి, నాటు సారాపై ఉక్కుపాదం
గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా కట్టడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం కొత్తగా ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ)ని ఏర్పాటు చేసి మరీ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది.

ఆంధ్ర – ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న గంజాయి దందాను కూకటివేళ్లతోసహా పెకలించి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ పరివర్తన్‌ దేశంలోనే రికార్డు సృష్టించింది. ముందుగా గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గంజాయి సాగు ప్రాంతాలను శాటిలైట్‌ మ్యాపింగ్‌ చేసి ప్రత్యేక బృందాలను నియమించి మరీ కట్టడి చేసింది.

మొత్తం 384 గ్రామాల్లో మూడు దశల్లో ఆపరేషన్‌ పరివర్తన్‌ నిర్వహించింది. మొత్తం 9,093 ఎకరాల్లో ఏకంగా రూ.11,659 కోట్ల విలువైన గంజాయి సాగును ధ్వంసం చేసింది. స్మగ్లింగ్‌ను అడ్డుకుని భారీగా స్వాధీనం చేసుకున్న గంజాయిని కాల్చివేసింది. 2022లో 2 లక్షల కేజీలు, 2023లో ఇప్పటివరకు 3.32 లక్షల కేజీల గంజాయి నిల్వలను కాల్చి బూడిద చేసింది. 

దశాబ్దాలుగా గంజాయి సాగే జీవనాధారంగా చేసుకున్న గిరిజనుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచి్చంది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహిస్తోంది. గతంలో గంజాయి సాగు చేసిన 7,328 ఎకరాల్లో కాఫీ, నిమ్మ, జీడి, కొబ్బరి, రాజ్మా, బత్తాయి వంటి పంటలు సాగు చేస్తుండటం ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పునకు నిదర్శనం.

♦ అదే రీతిలో నాటుసారా దందాపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నాటుసారా తయారీ కేంద్రాలుగా గుర్తింపు పొందిన మొత్తం 2,202 గ్రామాల్లో ఏకంగా 2,184 గ్రామాల్లో సారా బట్టీలన్నవే లేకుండా చేసింది. నాటు సారా కాచే వారిని ప్రత్యామ్నాయాల వైపు మళ్లిస్తోంది.

మిగతా కొద్ది గ్రామాల్లోనూ త్వరలోనే నాటు సారా రూపుమాపడానికి చర్యలు చేపట్టింది. ఈ నాలుగేళ్లలో నాటు సారా, అక్రమ మద్యం దందాపై విస్తృతంగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసింది.

2019లో 527 కేసులు, 2020లో 922 కేసులు, 2021లో 1,691 కేసులు, 2022లో 1,379 కేసులు నమోదు చేయడం విశేషం. దాంతో రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం దందా గణనీయంగా తగ్గింది. 2023లో ఇప్పటివరకు 497 కేసులే నమోదు కావడమే దీనికి నిదర్శనం. పదే పదే అక్రమ రవాణాకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్‌ కింద ఇప్పటివరకు 705 కేసులు నమోదు చేయడం  గమనార్హం.

రహదారి భద్రతకు ప్రాధాన్యం
ఎక్కువమందిని బలిగొంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రవాణా, ఆర్‌ అండ్‌ బి, వైద్య – ఆరోగ్య శాఖలతో సంయుక్త కార్యాచరణ చేపట్టింది. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై బ్లాక్‌ స్పాట్‌లను జియో ట్యాగింగ్‌ చేసి ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తోంది. ఆ ప్రదేశాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు, ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రత్యేకంగా అంబులెన్స్‌ల ఏర్పాటు మొదలైన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో 2019లో 20,575 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 2022నాటికి 19వేలకు తగ్గాయి. 

హత్యలు, ఘర్షణలు కట్టడి
ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో నాలుగేళ్లుగా హత్యలు, ఘర్షణలు గణనీయంగా తగ్గాయి. 2018తో పోలిస్తే 2022కి రాష్ట్రంలో హత్యలు 6 శాతం తగ్గగా, అల్లర్లు 36 శాతం తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో 2023 మొదటి త్రైమాసికాన్ని పోలిస్తే హత్యలు 15 శాతం తగ్గాయి. 

సైబర్‌ నేరాల కట్టడి
యావత్‌ ప్రపంచానికే సవాల్‌గా మారిన సైబర్‌ నేరాల కట్టడిలోనూ రాష్ట్ర పోలీసు శాఖ ముందుంది. సైబర్‌ నేరాల కట్టడికి పోలిసు శాఖ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైబర్‌ సెల్స్, సోషల్‌ మీడియా సెల్స్‌ ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా సైబర్‌ మిత్ర యాప్, 1930 రిపోర్టింగ్‌ సెల్‌ సెంటర్లను నెలకొల్పింది.

సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. లోన్‌ యాప్‌ల వేధింపుల కట్టడికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి పకడ్బందీగా పర్యవేక్షిస్తోంది. సైబర్‌ నేరాల బాధితులు గతంలో ఫిర్యాదు చేసేందుకు సరైన వ్యవస్థ ఉండేది కాదు. ఇప్పుడు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. 

శాంత్రిభద్రతల పరిరక్షణకు అగ్ర ప్రాధాన్యం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌ యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఘర్షణలు, అల్లర్లు, హత్యలను సమర్థంగా కట్టడి చేస్తున్నాం. సైబర్‌ నేరాలు, లోన్‌ యాప్‌ మోసాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. గంజాయి, నాటు సారా కట్టడికి విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్‌ పరివర్తన్‌ దేశంలోనే రికార్డు సృష్టించింది. – డీజీపీ కేవీ రాజేంద్రానాథ్‌ రెడ్డి

ప్రజల భద్రతకు భరోసానిస్తున్నారు
రాష్ట్రంలో నాలుగేళ్లుగా శాంతి భద్రతలు గణనీ­యంగా మెరుగయ్యాయి. ఘర్షణలు, అల్లర్లకు అవకాశం లేకుండా పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేస్తోంది. బాధితుల ఫిర్యాదులపట్ల సానుకూలంగా స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అవసరానికి మేమున్నాం అనే నమ్మకాన్ని పోలీసు యంత్రాంగం కల్పిస్తోంది.
– డా.ర్యాలీ శ్రీనివాస్,  గోదావరి కవి, తెలుగు అధ్యాపకుడు,  రామచంద్రాపురం, కోనసీమ జిల్లా

ప్రశాంత పరిస్థితులు  నెలకొల్పారు
ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించే సానుకూల పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసుల ద్వారా పోలీసు వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకురావడం గొప్ప విప్లవాత్మకమైన మార్పు. దాంతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అనే విధానం ఆచరణలోకి వ­చ్చిం­ది. ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది.  –సి. స్వరాజ్యలక్ష్మి,  రిటైర్డ్‌ ప్రిన్సిపల్, శ్రీ పద్మావతి డిగ్రీ–పీజీ కళాశాల, తిరుపతి

మరిన్ని వార్తలు