వేద విజ్ఞానంతోనే భారత్‌కు గుర్తింపు

29 Oct, 2021 03:32 IST|Sakshi
గణేశన్‌ శౌత్రికి మహామహోపాధ్యాయ పురస్కారం అందజేస్తున్న వీసీ సుదర్శన శర్మ, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి

వేద శాస్త్రాల్లో పరిశోధనలకు ప్రాధాన్యమివ్వండి

తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్‌(తిరుపతి): భారతీయ వేద విజ్ఞానాన్ని ఆలంబనగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు. ప్రాచీన వేదజ్ఞాన సంపదతోనే భారతదేశం విశ్వగురుగా ప్రపంచవేదికపై విశిష్ట గుర్తింపు సాధించిందని తెలిపారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విజయవాడలోని రాజ్‌భవన్‌ నుంచి వెబినార్‌ ద్వారా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన కీలకోపన్యాసం చేస్తూ..  ప్రాచీన కాలం నుంచి మన గ్రంథాలు, సాంస్కృతిక వారసత్వం, విజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు ప్రేరణగా నిలిచిందన్నారు. భారతీయ గణిత, జ్యోతిష్య, వాణిజ్య, ఆర్థిక శాస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ముందంజలో ఉండేవని తెలిపారు. విజ్ఞానాన్ని మౌఖిక ప్రసారం అనే భారతీయ సంప్రదాయాన్ని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం కాపాడుతుండడం అభినందనీయమని ప్రశంసించారు. పరిశోధక విద్యార్థులు వేద గణితం వంటి అంశాలను ఎంపిక చేసుకోవాలని గవర్నర్‌  సూచించారు.  

గణేశన్‌ శౌత్రికి మహా మహోపాధ్యాయ పురస్కారం 
తిరుపతికి చెందిన వేద పండితుడు గణేశన్‌ శౌత్రికి మహామహోపాధ్యాయ (గౌరవ డాక్టరేట్‌ ) పురస్కారం లభించింది. స్నాతక్సోత్సవంలో యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులు పూర్తి చేసిన 180 మందికి డిగ్రీలు అందజేశారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌.సుదర్శనశర్మ, టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు