ఉపాధి హామీలో రికార్డు

17 Apr, 2022 18:21 IST|Sakshi

లక్ష్యానికి మించి పనులు

కరోనా వేళ పేదలకు బాసట

2021–22లో 171.14 లక్షల పనిదినాలు

15 ఏళ్ల ఉపాధి చరిత్రలో సరికొత్త రికార్డు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఘనత

ఏలూరు (టూటౌన్‌): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వం ముందు చూపుతో లక్ష్యాలకు మించి పనులను కల్పించి ఉపాధి హామీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో జిల్లాలో అత్యధిక పనిదినాలు కల్పించడంతో పాటు అత్యధిక నిధులు ఖర్చు చేశారు. 170.63 లక్షల పనిదినాలు కల్పన లక్ష్యం కాగా 171.14 లక్షల పనిదినాలు కల్పించారు. మొత్తంగా రూ.653.79 కోట్లు ఖర్చు చేయగా కూలీలకు వేతనాలుగా రూ.365.89 కోట్లు అందించారు. మెటీరియల్‌ చెల్లింపుల కోసం రూ.287.90 కోట్లను వెచ్చించారు. 15 ఏళ్ల ఉపాధి హామీ చరిత్రలో ఇది ఆల్‌టైమ్‌ రికార్డు అని అధికారులు చెబుతున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ సమయంలో పేదలకు ఉపాధి హామీ పథకం బాసటగా నిలిచింది.  

1.50 కోట్ల పనిదినాల లక్ష్యం : 2022–23లోనూ కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని అధికారులు ప్రణాళికలు రచించారు. వేసవితో పాటు ఏడాది పొడవునా పనులు చూపేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 1.50 కోట్ల పనిదినాలు కల్పించడం ద్వారా కూలీలకు వేతనాలుగా రూ.320 కోట్ల వరకూ అందించేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి హమీ నిధులతో చేపట్టారు. ఆయా పనులు వివిధ పనుల్లో ఉన్నాయి. దీంతోపాటు కొత్తగా పనులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరోనా వంటి విపత్కర సమయం లోనూ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. 

లక్ష్యానికి మించి.. 
2021–22లో ఉపాధి హామీలో లక్ష్యానికి మించి పనులు కల్పించడంతో పాటు అత్యధికంగా కూలీలకు వేతనాలు చెల్లించారు. ఉమ్మడి జిల్లాలో 5.70 లక్షల కుటుంబాలకు చెందిన 9.99 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు 171.14 లక్షల పనిదినాలు కల్పించారు. 27,619 కుటుంబాలకు వంద రోజుల పనులు కల్పించారు. సగటున రోజుకు రూ.220.49 వేతనంగా అందించారు.   

అభివృద్ధికి బాటలు : ఉపాధి హామీ పథకంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణం, జగనన్న లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు ఉపాధి నిధులు వెచ్చిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జగనన్న లేఅవుట్లలో రూ.124 కోట్లతో 1,318 పనులు పూర్తి చేశారు. మొక్కలు, తోటల పెంపకానికీ నిధులు అందించారు. ఇనిస్టిట్యూషన్‌ ప్లాంటేషన్‌లో భాగంగా 118 ప్రభుత్వ సంస్థల్లో 7,231 మొక్కలు నాటారు. 1,090 జలసంరక్షణ పనులు పూర్తి చేశారు. 

అడిగిన అందరికీ పని 
ఉపాధి హామీ పథకంలో అడిగిన ప్రతిఒక్కరికీ పనులు కల్పించే విధంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్నాం. 2022–23లోనూ లక్ష్యానికి మించి పనులు చేపట్టేలా కృషిచేస్తున్నాం. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పరిధిలో పనులనూ సత్వరం పూర్తి చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. 
– డి.రాంబాబు, పీడీ, డ్వామా, ఏలూరు

మరిన్ని వార్తలు