ఎగుమతుల్లో పైపైకి..

28 Nov, 2022 02:30 IST|Sakshi

ఏటేటా దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌

రికార్డు స్థాయిలో ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎక్స్‌పోర్టులు

ఎక్కువగా నాన్‌ బాస్మతీ బియ్యం, పండ్లు, కూరగాయలు, బెల్లం, ఆక్వా ఉత్పత్తులే

ప్రభుత్వ ప్రోత్సాహమే కారణమంటున్న అధికారులు, ఎగుమతిదారులు

ఈ ఏడాది కోటి లక్షల టన్నుల ఎగుమతుల మార్క్‌ను అందుకునే అవకాశం 

టీడీపీ హయాంలో 2018–19లో రూ.8,929 కోట్ల విలువైన 31.48 లక్షల టన్నుల ఎగుమతే అత్యధికం

2020–21లో రూ.13,781 కోట్ల విలువైన 52.88 లక్షల టన్నుల ఆహార ఎగుమతులు

2021–22లో రూ.19,902 కోట్ల విలువైన 79.33 లక్షల టన్నులు..

2022–23లో ఇప్పటికే రూ.9,782 కోట్ల విలువైన 35.90 లక్షల టన్నులు..

సాక్షి, అమరావతి: ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు.. గ్రామస్థాయిలో ప్రభుత్వం కల్పిస్తున్న మార్కెటింగ్‌ సౌకర్యాలు సత్ఫలితాలిస్తున్నాయి. తొలి రెండేళ్లు కరోనా మహమ్మారికి ఎదురొడ్డి మరీ ఎగుమతులు సాగాయి.

లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఊపందుకున్నాయి. ఉదా.. 2018–19లో రూ.8,929 కోట్ల విలువైన 31.48 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు, రూ.13,855 కోట్ల విలువైన 2.62 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి జరిగితే.. 2021–22 నాటికి అవి రూ.19,902 కోట్ల విలువైన 79.33 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు, రూ.20వేల కోట్ల విలువైన 3.24 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి.

ఇది అరుదైన రికార్డు అని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) చెబుతోంది. ఇక ఈ ఏడాది (2022–23) తొలి అర్ధ సంవత్సరంలో రూ.9,782 కోట్ల విలువైన 35.90 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు, రూ.13వేల కోట్ల విలువైన 2.15 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఆహార, ఆక్వా ఉత్పత్తులు కలిపి టీడీపీ ఐదేళ్లలో గరిష్టంగా 2018–19లో రూ.22,784 కోట్ల విలువైన 34.10లక్షల టన్నులు ఎగుమతి అయితే 2021–22లో ఏకంగా రూ.39,921 కోట్ల విలువైన 82.57 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి.

టీడీపీ హయాంలో జరిగిన గరిష్ట ఎగుమతులను ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలోనే సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అధిగమించడం విశేషం. చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్దఎత్తున ఎగుమతులు జరగలేదని అధికారులతో పాటు ఎగుమతిదారులూ చెబుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే ఈ ఏడాది కోటి లక్షల టన్నుల మార్క్‌ను అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 

ఎగుమతుల్లో నాన్‌ బాస్మతీ రైస్‌దే సింహభాగం
రాష్ట్రం నుంచి ప్రధానంగా నాన్‌ బాస్మతీ రైస్, మొక్కజొన్న, జీడిపప్పు, బెల్లం, అపరాలు, గోధుమలు, శుద్ధిచేసిన పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలతో పాటు పెద్దఎత్తున ఆక్వా ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. నాన్‌ బాస్మతీ రైస్‌ ఉత్పత్తుల ఎగుమతులకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఏపీ నిలిచింది.

మొత్తం ఎగుమతుల్లో సింహభాగం నాన్‌ బాస్మతీ రైస్‌దే. 2018–19లో రూ.7,324కోట్ల విలువైన 29.22 లక్షల టన్నులు ఎగుమతి అయితే.. 2021–22లో రూ.17,225 కోట్ల విలువైన 68.57 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. ఇక ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలోనే రూ.7,718 కోట్ల విలువైన 29.48 లక్షల టన్నుల నాన్‌ బాస్మతీ రైస్‌ ఎగుమతి అయ్యింది. ఏపీ నుంచి ఎక్కువగా మిడిల్‌ ఈస్ట్, దక్షిణాసియా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుండగా, గతేడాది అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్, అరబ్‌ దేశాలకు ఎగుమతైంది.

ప్రభుత్వ ప్రోత్సాహంతో పోటీపడుతున్న వ్యాపారులు
ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రోత్సాహం, గ్రామస్థాయిలో కల్పించిన సౌకర్యాలతో గత మూడు సీజన్లలో వ్యవసాయ విస్తీర్ణంతో పాటు నాణ్యమైన దిగుబడులు పెరిగాయి. మూడేళ్లలో ఏటా సగటున 14 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తుల దిగుబడులు అదనంగా వచ్చాయి. కేంద్రం మద్దతు ధర ప్రకటించని ఆహార ఉత్పత్తులకూ రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించడం, ధరలు తగ్గిన ప్రతీసారి మార్కెట్‌లో జోక్యం చేసుకోవడంతో వ్యాపారులు సైతం పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే.. 

► మూడేళ్ల క్రితం క్వింటాల్‌ రూ.4,500 కూడా పలకని పసుపు ఈ ఏడాది ఏకంగా రూ.10 వేలకు పైగా పలికింది. 
► రెండేళ్ల క్రితం రూ.4,800 ఉన్న పత్తి నేడు రూ.9,500 పలుకుతోంది. 
► అలాగే, రూ.5 వేలు పలకని మినుములు రూ.7వేలు, వేరుశనగ సైతం రూ.6వేల నుంచి రూ.7వేల వరకు పలుకుతున్నాయి. 
► కందులు, పెసలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు సైతం ఎమ్మెస్పీకి మించి ధర పలుకుతున్నాయి. 
► అరటి, బత్తాయి వంటి ఉద్యాన ఉత్పత్తులకు కూడా మంచి ధర లభిస్తోంది. 
► ఇక దేశం నుంచి ఎగుమతి అయ్యే సముద్ర ఉత్పత్తుల్లో 36 శాతం, రొయ్యల్లో 67 శాతం మన రాష్ట్రం నుంచే విదేశాలకు వెళ్తున్నాయి. నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేయడంతో యాంటీబయోటిక్స్‌ రెసిడ్యూల్స్‌ శాతం కూడా గణనీయంగా తగ్గడం ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు పెరిగేందుకు కారణంగా చెబుతున్నారు.

14వేల టన్నులు ఎగుమతి చేశాం
2021–22లో ఏపీ నుంచి 50 వేల నుంచి 60 వేల టన్నుల అరటి ఎగుమతులు జరిగాయి. మా కంపెనీ ఒక్కటే 14 వేల టన్నులు ఎగుమతి చేసింది. ఇరాన్, మలేసియా, దుబాయ్‌ దేశాలకు ఎగుమతి చేశాం. ఈ ఏడాది కూడా ఎగుమతులు ఆశాజనకంగా ఉండబోతున్నాయి.
– ఎం. ప్రభాకరరెడ్డి, ఏపీ కోఆర్డినేటర్, దేశాయ్‌ ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్‌ కంపెనీ

ఎగుమతులు పెరగడం రైతుకు లాభదాయకం
గతేడాది రికార్డు స్థాయిలో ఆక్వా ఎగుమతులు జరిగాయి. రైతులకు కూడా మంచి రేటు వచ్చింది. రొయ్యలతో పాటు సముద్ర మత్స్య ఉత్పత్తులను కూడా వ్యాపారులు పోటీపడి కొన్నారు. విశాఖ, కాకినాడ, నెల్లూరు పోర్టుల నుంచి ఆక్వా ఉత్పత్తులు భారీగా ఎగుమతి అయ్యాయి.
– ఐసీఆర్‌ మోహన్‌రాజ్, అధ్యక్షుడు, జాతీయ రొయ్య రైతుల సమాఖ్య

‘గాప్‌’ సర్టిఫికేషన్‌తో మరిన్ని ఎగుమతులు
గతంలో ఎన్నడూలేని విధంగా 79 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులతో పాటు 20వేల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అయ్యాయి. వచ్చే సీజన్‌ నుంచి రైతులకు ‘గాప్‌’ (గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీస్‌) సర్టిఫికేషన్‌ జారీచేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. అది ఉంటే యూరోపియన్‌ దేశాలకు ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి.
– పూనం మాలకొండయ్య, స్పెషల్‌ సీఎస్, వ్యవసాయ శాఖ

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రోత్సాహంవల్లే..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు, కల్పించిన మార్కెటింగ్‌ సౌకర్యాల ఫలితంగా ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏటా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవడం సంతోషదాయకం. ఆహార, ఆక్వా ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేందుకు పెద్దఎత్తున ఫుడ్‌ ప్రొసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నాం.
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

మరిన్ని వార్తలు