వేదన తీర్చిన వేదావతి 

26 Sep, 2022 15:48 IST|Sakshi

రాయదుర్గం(అనంతపురం): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన బైరవానితిప్ప (బీటీపీ) ప్రాజెక్టుకు చరిత్రలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో వరదనీరు కొనసాగుతోంది. ఈ క్రమంలో వేదావతి ఉగ్రరూపం దాల్చింది. గుమ్మఘట్ట మండలంలోని బైరవానితిప్ప గ్రామం వద్ద 1954లో వేదావతి నదిపై రూ.1.5 కోట్లతో 2.5 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టి 1961లో పూర్తిచేశారు. 1981–82 మధ్య కాలంలో 8 గేట్లు తెరిచి 12 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసిన రికార్డు మాత్రమే ఇప్పటిదాకా ఉంది.  

రికార్డు బద్దలు.. 
క్యాచ్‌మెంట్‌ ఏరియా కర్ణాటకలో ఉండడం, అక్కడ విస్తారంగా వానలు కురవడం వెరసి ఈ ఏడాది జూలై చివర్లోనే రిజర్వాయర్‌ వరద నీటితో తొణకిసలాడింది. క్రమేణ నీటి ప్రవాహం పెరగడంతో పాటు వేదావతి నదిపై నిర్మించిన వాణివిలాస్‌ ప్రాజెక్ట్‌ కూడా 88 ఏళ్ల తర్వాత మరువ పారింది. వీటి మధ్య చిన్న కుంటలు, చెక్‌డ్యామ్‌లు, చెరువులు తెగి ఉగ్రరూపం దాల్చి  ప్రమాదకరంగా దిగువకు నది పరవళ్లు తొక్కింది. ఈ కారణంగా ఆగస్టు 5న నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు. 45 రోజుల పాటు ఏకంగా 28 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయడం ఓ రికార్డయితే సెప్టెంబర్‌ 7న 10 గేట్లు తెరిచి 65 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడం విశేషం. వర్షాలు తగ్గుముఖం పట్టినా 4,500 క్యూసెక్కుల ఇన్‌ప్లో కొనసాగుతుండగా 2 క్రస్టు గేట్లు తెరిచి 4,500 క్యూసెక్కుల మేర నీటిని వదులుతున్నారు.  

స్తంభించిన జనజీవనం.. 
రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు తదితర ప్రాంతాలను అనుసంధానం చేస్తూ వేదావతి హగరి ప్రవహిస్తోంది. ఈ కారణంగా గత 45 రోజుల నుంచి హగరి పరివాహ గ్రామాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం మండలాలను కలిపే వేపులపర్తి కాజ్‌వే దెబ్బతినడంతో పాటు నీటి ఉధృతి తగ్గలేదు. దీంతో రాకపోకలు ఆగిపోయాయి. ఈ క్రమంలో కళ్లెదుటే కనిపించే గ్రామాలకు సైతం 20 కిలోమీటర్లు చుట్టుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది.   

మరిన్ని వార్తలు