ఏపీ: ఖరీఫ్‌ జోరు.. అన్నదాత హుషారు 

8 Aug, 2021 10:22 IST|Sakshi

రాష్ట్రంలో వివిధ పంటల సాగు లక్ష్యం 95.35 లక్షల ఎకరాలు

ఇప్పటికే 42.8 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి

39.97 లక్షల ఎకరాలకు గాను 16.33 లక్షల ఎకరాల్లో వరి నాట్లు

లక్ష్యం దిశగా మిగిలిన పంటల సాగు

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ సాగు జోరందుకోవడంతో పల్లెలు పచ్చదనాన్ని సింగారించుకుంటున్నాయి. సీజన్‌కు ఆరంభానికి ముందే వైఎస్సార్‌ రైతు భరోసా (పెట్టుబడి సాయం) అందడం.. ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన సబ్సిడీ, నాన్‌ సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయడం.. అవసరమైనన్ని ఎరువులు, పురుగుల మందుల నిల్వల్ని అందుబాటులో ఉంచడం.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. గడచిన రెండేళ్ల ఖరీఫ్‌ రికార్డులను తిరగరాసే దిశగా దూసుకెళ్తున్నారు.

రూ.3,829 కోట్ల పెట్టుబడి సాయం
సీజన్‌కు ముందుగానే వైఎస్సార్‌ రైతు భరోసా కింద 54 లక్షల మంది రైతులకు తొలి విడతగా ఒక్కొక్కరికీ రూ.7,500 చొప్పున రూ.3,829 కోట్ల పెట్టుబడి సాయమందించిన రాష్ట్ర ప్రభుత్వం సాగులోæ అన్నివిధాల అండగా నిలుస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా 7.49 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు రైతులకు అందాయి. వీటిలో 45,412 ప్యాకెట్ల మిరప, 28,144 క్వింటాళ్ల మొక్కజొన్న, పత్తి విత్తనాలు ఉన్నాయి. 5.80 లక్షల టన్నుల ఎరువులు, 10 టన్నుల పురుగుల మందులను సైతం రైతులకు ఇప్పటికే పంపిణీ చేశారు.

రికార్డు తిరగరాసే దిశగా..
ఖరీఫ్‌ చరిత్రలో రికార్డు స్థాయిలో 2019లో 90.38 లక్షల ఎకరాల్లో, 2020లో 90.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. 2021 ఖరీఫ్‌లో 95.35 లక్షల ఎకరాల్లో వివిధ పంటల్ని సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆరంభంలో కాస్త ఆచితూచి అడుగులేసిన అన్నదాతలు పరిస్థితులు ఆశాజనకంగా ఉండటంతో ఇప్పుడు సాగు జోరు పెంచారు.

ఇప్పటికే 42.8 లక్షల (46శాతం)ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించి నాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది 39.97 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 16.33 లక్షల (43శాతం) ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. గడచిన రెండేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. ఇదే సమయానికి 2019లో 15.82 లక్షల ఎకరాలు, 2020లో 16.20 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఇప్పటివరకు 10.83 లక్షల ఎకరాల్లో నూనె గింజలు, 8.9 లక్షల ఎకరాల్లో పత్తి, 2.6 లక్షల ఎకరాల్లో అపరాల నాట్లు పూర్తయ్యాయి.

ప్రోత్సాహం బాగుంది
ఖరీఫ్‌లో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నా. తొలిసారి మా గ్రామంలోని ఆర్‌బీకే ద్వారా విత్తనాలు, ఎరువులు తీసుకున్నాను. వాతావరణం అనుకూలంగా ఉండటంతో నాట్లు పూర్తయ్యాయి.
– గుంజా బసవయ్య,  రైతు, కానూరు, కృష్ణా జిల్లా

లక్ష్యం దిశగా ఖరీఫ్‌ సాగు
లక్ష్యం దిశగా ఖరీఫ్‌ సాగు జరుగుతోంది. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతు భరోసా యాత్రలు సత్ఫలితాలనిచ్చాయి. సిఫార్సు చేసిన పంటలను సాగు చేసేవిధంగా రైతుల్లో అవగాహన కల్పించాం. గడచిన రెండేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది ఖరీఫ్‌ సాగవుతుందని అంచనా వేస్తున్నాం.
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ 

మరిన్ని వార్తలు