దిగుబడి వరిస్తోంది 

5 Nov, 2023 04:22 IST|Sakshi

గోదావరి డెల్టాల్లో రికార్డు స్థాయిలో వరి దిగుబడులు 

ఎకరాకు 34 నుంచి 48 బస్తాలు 

కలిసొచ్చిన వర్షాభావం 

గట్టెక్కించిన గోదావరి

సాక్షి అమలాపురం: వర్షాభావ పరిస్థితులు.. గోదావరి నదిలో అరకొరగా వచ్చిన ప్రవాహ జలాలు గోదావరి డెల్టాల్లో ఖరీఫ్‌కు కలిసొచ్చింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తోంది. వర్షాలు లేకున్నా ప్రభుత్వ యంత్రాంగం గోదావరి కాలువలకు సంవృద్ధిగా సాగునీరు అందించడంతో డెల్టాల్లో ప్రాంతాన్ని బట్టి 34 బస్తాలు (బస్తా 75 కేజీలు) నుంచి 48 బస్తాల వరకు దిగుబడి లభిస్తోంది.

ఇప్పటికే కోతలు మొదలైన తూర్పు డెల్టాలోని రాయవరం, మండపేట, పశ్చిమ డెల్టా పరిధిలోని నిడదవోలు వంటి మండలాల్లో కొన్నిచోట్ల 48 బస్తాల వరకు దిగుబడిగా వస్తుండటంతో రైతులు సాగుపై ఆశలు పెట్టుకున్నారు. ఈశాన్యం వల్ల భారీ వర్షాలు, వాయుగుండాలు, తుపానులు రాకుండా ఉంటే ఈ ఖరీఫ్‌లో లాభాలు కళ్లజూస్తామని ఆయకట్టు రైతులు చెబుతున్నారు.   

ఉమ్మడి ‘తూర్పు’లో 3.90 లక్షల ఎకరాలు 
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ప్రస్తుతం 3.90 లక్షల ఎకరాల్లో వరి ఆయకట్టు ఉంది. కోనసీమ జిల్లాలో 1.58 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. అధికారుల అంచనా ప్రకారం ఇక్కడ 3.80 లక్షల టన్నులు. వ్యవసాయ శాఖ గణంకాల ప్రకారం డెల్టాలో ఖరీఫ్‌ దిగుబడి సగటున 28 బస్తాలు. కానీ.. కోనసీమ జిల్లాలో ఇక్కడ ఎకరాకు సగటున 32.50 బస్తాల వరకు దిగుబడి వస్తుందని అధికారుల చెబుతున్నారు.

వాస్తవానికి ఈ జిల్లా పరిధిలో అంచనాలకు మించి దిగుబడి వస్తోంది. జిల్లాలోని ఆత్రేయపురంలో నిర్వహించిన పంట కోత ప్రయోగంలో ఎకరాకు సగటు 34 బస్తాల దిగుబడిగా తేలింది. రాయవరం మండలంలో వరి కోతలు ప్రారంభం కాగా.. ఇక్కడ 42 నుంచి 46 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. జిల్లాలోని సముద్ర తీర ప్రాంత మండలాల్లో 32 బస్తాల నుంచి 35 బస్తాల వరకు దిగుబడి వస్తుందని అంచనా. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పరిధిలో వరి కోతలు కొనసాగుతున్నాయి.

ఇక్కడ సగటున 35 బస్తాల దిగుబడిగా వస్తుండగా.. పశ్చిమ డెల్టా పరిధిలోని పెరవలి మండలంలో 38 నుంచి 42 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. కాకినాడ జిల్లాలో పిఠాపురం పరిధిలో ప్రాంతాన్ని బట్టి 32 నుంచి 40 బస్తాల వరకు పండింది. గత కొన్నేళ్లుగా ఖరీఫ్‌ సాగు అనుకున్న స్థాయిలో దిగుబడి రావడం లేదు. పంట కోతకు వచ్చే సమయంలో భారీ వర్షాలు రైతులను ముంచేస్తున్నాయి. పంట పండినా దిగుబడి రావడం లేదు. కోనసీమ జిల్లాలో గత ఖరీఫ్‌ కొన్ని ప్రాంతాల్లో 24 బస్తాలు మించి పండలేదు.  

వర్షాభావం కలిసొచ్చింది 
ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటం వల్ల డెల్టాలో మంచి దిగుబడి వస్తోంది. ఎండల వల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరగటం దిగుబడి పెరగడానికి కారణమైంది. మండపేట, రాయవరం వంటి మండలాల్లో నిర్వహించిన పంట కోత ప్రయోగాలలో సగటు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది.   – బోసుబాబు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా 

మరిన్ని వార్తలు