కరోనా: ఆఖరు ఘడియల్లో ఆత్మబంధువులు 

5 Sep, 2020 10:33 IST|Sakshi
పూలమాలలతో కరోనా మృతులకు నివాళి

మానవత్వాన్ని కరోనా మంట గలిపేసింది. రోగంతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి కుటుంబ సభ్యులే వెళ్లలేని పరిస్థితిని తీసుకొచ్చింది. తాకితే కరోనా వచ్చేస్తుందేమోనన్న భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. మాయదారి మహమ్మారి ప్రాణంతోపాటు అయిన వారిని దూరం చేస్తోంది. అసువులు బాస్తే భయంతో బంధువులూ సైతం రావడం లేదు. కనీసం కడసారి చూపునకు నోచుకోలేకపోతున్నారు. చివరకు అంత్యక్రియలకు అడుగడుగునా ఆటంకాలే. మృతదేహాన్ని సొంతూరు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిద్దామంటే... అయిన వాళ్లే అడ్డు పడుతున్నారు. అంతిమ సంస్కారాలకు ఆ నలుగురు కూడా రాని పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ నేపథ్యంలో మేమున్నామంటూ రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో కొందరు యువకులు ముందుకొచ్చి సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

సాక్షి, శ్రీకాకుళం: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మానవ సంబంధాలను ప్రశ్నిస్తోంది. అక్కడెక్కడో కాదు మన దగ్గర మచ్చుకైనా మానవత్వం లేకుండా చేస్తోంది. కుటుంబంలో ఒకరికి కరోనా సోకితే ఇంట్లో వాళ్లందరికీ వచ్చేస్తుందన్న భయం పట్టుకుంది. కరోనా వచ్చిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సైతం వణుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఇక చనిపోయిన రోగుల మృతదేహాల వద్దకు వెళితే కరోనా చుట్టేస్తుందన్న అభద్రతా భావాన్ని సృష్టించింది. వాస్తవంగా కరోనాతో చనిపోయిన ఆరు గంటల తర్వాత మృతదేహం నుంచి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది. ఈ విషయాన్ని అధికారులు, వైద్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం భయపడిపోతున్నారు. కరోనాతో చనిపోతే దగ్గరకు రావడం లేదు.

అంత్యక్రియల కోసం అంబులెన్స్‌లో తరలింపు 
ఆ మృతదేహాన్ని ముట్టు కోవడానికి సాహసించడం లేదు. కరోనా మృతుల వద్దకే కాదు సాధారణంగా చనిపోయిన వారి దగ్గరికి సైతం వెళ్లడం లేదు. కరోనా వలన చనిపోయారేమోనన్న భయంతో మృతదేహాలను తాకడం లేదు. దీనితో అంతిమ సంస్కారాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ అవగాహనతో కొందరు యువకులు ఆ మృతదేహాలకు దహన కార్యక్రమాలు చేపట్టేందుకు మేమున్నా మంటూ ముందుకొస్తున్నారు. మృతి చెందిన 6 గంటల తర్వాత కరోనా వ్యాపించదని నిరూపిస్తున్నారు. రెడ్‌క్రాస్‌ తరపున జిల్లాకు చెందిన పి.తవుడు, ఎన్‌.ఉమాశంకర్, జి.సత్యసుందర్, ఎల్‌.రవికుమార్, పి.సూర్య ప్రకాష్, పి.చైత న్య, సిహెచ్‌ కృష్ణంరాజు, జి.విజయబాబు, బి.శ్రీధర్, కె.సత్యనారాయణ, జి.పవన్‌కుమార్‌ (డ్రైవర్‌), ఎన్‌.కోటీశ్వరరావు తదితరులు కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇప్పటివరకు జిల్లాలో 20 కోవిడ్‌ మృతదేహాలకు, నాలుగు సాధారణ మృతదేహాలకు దహన సంస్కారాలు చేశారు. కరోనాతో మృతి చెందినా, సాధారణ మృతులకైనా ఎక్కడైనా అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితులు ఉంటే 8333941444కు ఫోన్‌ చేస్తే వెంటనే స్పందిస్తామని స్వర్గధామం రథం కో ఆర్డినేటర్‌ ఎన్‌.కోటీశ్వరరావు విజ్ఞప్తి చేశారు. కరోనా మృతదేహాలపై వివక్ష చూపించాల్సిన అవసరం లేదని, దహన సంస్కారాలు చేసేందుకు తాము సిద్ధమని తెలిపారు.

మరిన్ని వార్తలు