చూస్తే ప్రకృతి ధామంలా ఆహ్లాదంగా ఉంటుంది! కానీ అది..

12 Feb, 2023 08:33 IST|Sakshi

అక్కడికి అడుగుపెట్టగానే పచ్చనిచెట్లు స్వాగతం పలుకుతాయి. ప్రకృతి రమణీయత ఆహ్లాదాన్ని పంచుతుంది. పాడిపంటలు కనువిందు చేస్తాయి. జీవవైవిధ్యం ముచ్చటగొలుపుతుంది. ఒకసారి ప్రవేశిస్తే ఎంతసేపైనా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అలాగని అదేమీ అందమైన అటవీ ప్రాంతం కాదు. జనారణ్యం నడుమ ఉన్న ఓ జైలు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం. అదే రెడ్డిపల్లి ఓపెన్‌ ఎయిర్‌ జైలు (ఖైదీల వ్యవసాయ క్షేత్రం). ఖైదీల పరివర్తన కేంద్రంగా, అందమైన వ్యవసాయ క్షేత్రంగా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. 

సాక్షి, అనంతపురం: క్షణికావేశంలో చేసిన నేరాలు జైలుగోడల మధ్యకు నెడతాయి. సుదీర్ఘకాలం అక్కడే ఉండిపోవాల్సి వస్తే జీవితమే నరకంగా మారుతుంది. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి కానీ అది పరివర్తనకు దోహదపడినప్పుడే అర్థవంతమవుతుంది. ఖైదీల్లో పరివర్తన, చట్టాలను గౌరవించే పౌరులుగా తీర్చిదిద్దడం, పునరావాసానికి దోహదపడాలనే ఉద్దేశంతో ఓపెన్‌ ఎయిర్‌జైలు వ్యవస్థను ప్రవేశపెట్టారు.

ఇందులో భాగంగా బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద  ఓపెన్‌ ఎయిర్‌ జైలును 1965 సంవత్సరంలో అప్పటి కేంద్రమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతపురం నగరానికి అత్యంత చేరువలో ఉండే ఈ జైలును మొదట్లో 1,427.57 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. తర్వాత క్రమంలో జిల్లా జైలు, ఏపీఎస్‌పీ బెటాలియన్, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీకి 623.44 ఎకరాలను కేటాయించారు. దీంతో ప్రస్తుతం 804.13 ఎకరాల్లో ఓపెన్‌ ఎయిర్‌జైలు కొనసాగుతోంది. 

స్వేచ్ఛ జీవితం, నైపుణ్య శిక్షణ
సాధారణ జైల్లో శిక్ష అనుభవించే సమయంలో క్రమశిక్షణతో మెలిగి, పరివర్తన చెందేవారిని చివరిదశలో రెడ్డిపల్లి ఓపెన్‌ ఎయిర్‌జైలుకు పంపుతారు. ఇక్కడి స్వేచ్ఛా వాతావరణంలో ఖైదీల్లో ఒత్తిడి తగ్గించి.. వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు సమగ్ర వికాసానికి దోహదం చేస్తున్నారు. వారు విడుదలైన తర్వాత సమాజంలో సాఫీగా బతకడానికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. వాస్తవానికి ఈ జైలును 300 మంది ఖైదీల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. అయితే..జిల్లా జైళ్లలోనే సెమీ ఓపెన్‌ఎయిర్‌ సిస్టం తేవడం, నేరాల సంఖ్య తగ్గడం, ఇతరత్రా కారణాల వల్ల ప్రస్తుతం  ఇక్కడ 32 మంది మాత్రమే ఉన్నారు.  

పంటల సాగు పెట్రోల్‌ నిర్వహణ
రెడ్డిపల్లి ఓపెన్‌ ఎయిర్‌జైలు ఖైదీలు వ్యవసాయ, అనుబంధ విభాగాలతో పాటు పెట్రోల్‌ బంకుల నిర్వహణలోనూ సత్తా చాటుతున్నారు. దాదాపు అన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వీటిని గతంలో ట్రాక్టరులో అనంతపురానికి తెచ్చి విక్రయించేవారు. ఇప్పుడు జైలు వద్దే  అనంతపురం–తాడిపత్రి రహదారి పక్కన అమ్ముతున్నారు.

తక్కువ పురుగు మందుల వాడకంతో నాణ్యమైన కూరగాయలు పండిస్తుండడంతో వీటి కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మామిడి, సపోటా, ఉసిరి తదితర పండ్లతోటల సాగుతో పాటు డెయిరీ నిర్వహణ, గొర్రెలు, పశువుల పెంపకంలోనూ ఖైదీలు నైపుణ్యం సాధించారు. ఇక పెట్రోల్‌ బంకుల నిర్వహణలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ రెండు పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ రూ.పది లక్షల దాకా వ్యాపారం చేస్తున్నారు.  

ప్రకృతి రమణీయత..జీవవైవిధ్యం
ఓపెన్‌ ఎయిర్‌జైలు ప్రకృతి రమణీయతకు నిలయంగా ఉంది. ఎటుచూసినా చెట్లు, పండ్ల తోటలు, పంటలతో అలరారుతోంది. వన్యప్రాణులకూ ఆశ్రయమిస్తోంది. పచ్చనిచెట్ల మధ్య నెమళ్లు, కుందేళ్లు, అడవి పందులు, ముంగిసలు తదితర వన్యప్రాణులు సందడి చేస్తున్నాయి. వీటిని ఖైదీలు, జైలు అధికారులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, వైవిధ్యం కల్గివున్నందునే అది ఒక జైలన్న భావన కల్గదు. అక్కడున్న వారు ఖైదీలన్న విషయమూ మరచిపోతాము.   

(చదవండి:

మరిన్ని వార్తలు