పర్యాటకాభివృద్ధికి రైల్వేస్టేషన్ల రీ డెవలప్‌మెంట్

28 Feb, 2021 04:00 IST|Sakshi
అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు తరహాలో గుంతకల్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణం

మూడేళ్లలో రూ.660 కోట్లతో తిరుపతి, నెల్లూరు రైల్వేస్టేషన్ల అభివృద్ధి 

ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలతో గుంతకల్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి 

విజయవాడ, విశాఖ రైల్వేస్టేషన్లపైనా అధ్యయనం 

సాక్షి,అమరావతి: రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి రైల్వేస్టేషన్ల రీ డెవలప్‌మెంట్‌ దోహదపడనుంది. దీంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. రైల్వేస్టేషన్ల రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుల కింద ఏపీలో తిరుపతి, నెల్లూరు స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ రెండింటిని రూ.660 కోట్లు వెచ్చించి మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ హబ్‌లుగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే గుంతకల్‌ స్టేషన్‌ను రూ.25 కోట్లతో రైల్వే అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మాదిరిగా ఫ్రంట్‌ వ్యూను అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. తిరుపతి, నెల్లూరు స్టేషన్ల రీ డెవలప్‌మెంట్‌ కోసం రైల్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ) గతేడాది టెండర్లను ఆహ్వానించింది. అర్హత గల కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేశామని ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఇప్పటికే నిర్మాణ సంస్థలకు అవగాహన కల్పించేందుకు ప్రీ బిడ్‌ సమావేశాలను పూర్తి చేశారు. వీటిలో జీఎంఆర్, ఒబెరాయ్, ఆంబియెన్స్, ఆదానీ గ్రూప్, గోద్రేజ్‌ ప్రాపర్టీస్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, తదితర నిర్మాణ సంస్థలు పాల్గొన్నాయి. రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసి 60 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నారు. రైల్వేస్టేషన్ల అభివృద్ధిలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో షాపింగ్, సినిమా హాళ్లు, హాస్పిటాలిటీ, ఫుడ్‌ కోర్టులు, క్లోక్‌ రూంలు, వసతి గృహాలు, ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లు వంటివాటిని అంతర్జాతీయ స్థాయిలో నిరి్మస్తారు. అలాగే ఫ్రెండ్లీ యాక్సెస్‌ ర్యాంప్‌లు, ఎలివేటర్లు తదితర సౌకర్యాలు కల్పిస్తారు. 

పీపీపీ విధానంలో అభివృద్ధి 
తిరుపతి రైల్వేస్టేషన్‌ను రూ.530 కోట్లతో, నెల్లూరు స్టేషన్‌ను రూ.130 కోట్లతో రీ డెవలప్‌మెంట్‌ చేయనున్నారు. టెండర్లు ఖరారయ్యాక మూడేళ్లలోపు రీ డెవలప్‌మెంట్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండు స్టేషన్లను పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద అభివృద్ధి చేస్తారు. ఈ ఏడాది బడెŠట్‌ట్‌లో తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి రూ.5 కోట్లను కేటాయించారు. ఇక విజయవాడ, విశాఖ రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సాంకేతిక–ఆర్థిక సాధ్యాసాధ్య అధ్యయనం నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా పీపీపీ విధానంలోనే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని పీయూష్‌ గోయల్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు