తగ్గిన మద్యం వినియోగం

21 Sep, 2021 05:16 IST|Sakshi

సత్ఫలితాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలు

మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

కావలి: రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 27 నెలలుగా అమలు చేస్తున్న దశల వారీ మద్య నియంత్రణ కారణంగా మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. బెల్ట్‌ దుకాణాలు పూర్తిగా తొలగించడంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 40 శాతం, బీరు అమ్మకాలు 78 శాతం తగ్గుముఖం పట్టాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు.  

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని సెబ్‌ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 జూన్‌ నాటికి రాష్ట్రంలో 4,408 మద్యం దుకాణాలు ఉండగా, ప్రభుత్వం 33 శాతం మేర దుకాణాల సంఖ్యను తగ్గించడంతో ప్రస్తుతం 2,975 దుకాణాలు మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలు లాభాపేక్షతో ప్రైవేట్‌ వ్యక్తుల ద్వారా మద్యం దుకాణాలు నిర్వహించగా.. ప్రస్తుత ప్రభుత్వం దశల వారీ నియంత్రణకు దుకాణాలు తెరిచి ఉంచే సమయాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ పర్యవేక్షణలో విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టిందన్నారు. అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ కృష్ణకిషోర్‌రెడ్డి, సెబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు