Liquor Sales Dip: తగ్గిన మద్యం అమ్మకాలు

25 May, 2021 05:52 IST|Sakshi

21 శాతం మేర తగ్గుదల నమోదు

బీరు విక్రయాలు, లిక్కర్‌ అమ్మకాల్లోనూ ఇదే పరిస్థితి

బీరు అమ్మకాల్లో 52 శాతం, లిక్కర్‌లో 10 శాతం తగ్గుదల

ఆదాయం కంటే ప్రజారోగ్యానికే ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

సత్ఫలితాలనిస్తున్న ప్రభుత్వ చర్యలు  

సాక్షి, అమరావతి: మద్యం మీద వచ్చే ఆదాయం కంటే ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇందుకు కర్ఫ్యూ కూడా తోడవ్వడంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. బెల్టు షాపులను తొలగించడం, అక్రమ మద్యం విక్రయాలను, రవాణాను అడ్డుకోవడం, అమ్మకాల సమయం కుదించడం.. తదితర చర్యల ద్వారా దశలవారీ మద్యపాన నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఇప్పుడు కర్ఫ్యూ కోసం మద్యం దుకాణాల సమయాలను మరింతగా కుదించారు. దీంతో ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఏప్రిల్‌ 1 నుంచి 23 వరకు రాష్ట్రంలో బీరు, లిక్కర్‌ కలిపి మొత్తం 21,31,558 కేసులు విక్రయించగా.. మే నెలలో 1 నుంచి 23 వరకు 16,74,343 కేసులే అమ్ముడయ్యాయి. తద్వారా మద్యం అమ్మకాలు 21.45 శాతం మేర తగ్గినట్లు తేలింది.  

దిగిన బీరు, లిక్కర్‌..
సాధారణంగా వేసవిలో బీరు విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం బీరు అమ్మకాల్లో భారీ తగ్గుదల నమోదైంది. ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు మద్యం దుకాణాలు, బార్లలో కలిపి రోజుకు సగటున 28,184 బీరు కేసులు విక్రయించగా.. మే నెలలో కర్ఫ్యూ అమలైన 5వ తేదీ నుంచి 23 వరకు రోజుకు సగటున 13,423 బీరు కేసులే అమ్ముడయ్యాయి. తద్వారా బీరు అమ్మకాల్లో 52.37 శాతం తగ్గుదల నమోదైందని అధికారులు పేర్కొన్నారు. లిక్కర్‌ అమ్మకాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు మద్యం దుకాణాలు, బార్లలో కలిపి రోజుకు సగటున 63,455 లిక్కర్‌ కేసులు విక్రయించగా.. మే నెలలో 5 నుంచి 23 తేదీ వరకు రోజుకు సగటున 56,665 కేసుల అమ్మకాలే జరిగాయి. తద్వారా లిక్కర్‌ అమ్మకాలు 10.70 శాతం తగ్గినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలలో ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. ఏప్రిల్‌లో 1 నుంచి 23 వరకు మద్యం అమ్మకాలతో రూ.1,531.97 కోట్లు వచ్చింది. మే నెలలో 1 నుంచి 23వ తేదీ వరకు రూ.1,318.17 కోట్ల ఆదాయమే వచ్చింది. అంటే దాదాపు 14 శాతం మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది.  

మరిన్ని వార్తలు