ఏపీ నుంచి తెలంగాణకు 322 ఆర్టీసీ బస్సుల తగ్గింపు!

12 Oct, 2020 03:41 IST|Sakshi

వచ్చే ఏడాది మార్చి వరకు అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోనున్న ఏపీఎస్‌ఆర్టీసీ

ఈసారి విజయవాడలోనే టీఎస్‌ అధికారులతో చర్చలు 

సాక్షి, అమరావతి: తెలంగాణ ఆర్టీసీ డిమాండ్‌ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆ రాష్ట్రానికి 322 బస్సులను తగ్గించనుంది. లాక్‌డౌన్‌ ముందు వరకు ఏపీ నుంచి తెలంగాణకు రోజుకు 1,009 బస్సుల్ని ఏపీఎస్‌ఆర్టీసీ నడిపింది. ఇకపై 687 బస్సులను మాత్రమే తిప్పనుంది. తెలంగాణ భూభాగంలో ఇంతకుముందు వరకు 2.65 లక్షల కి.మీ.లలో బస్సులను తిప్పగా ఇక నుంచి 1.61 లక్షల కి.మీ.కే పరిమితం కానుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలు త్వరలో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.

తెలంగాణ ఏడాది కాలానికి ఒప్పందం కుదుర్చుకుందామని ప్రతిపాదించగా ఏపీ మాత్రం వచ్చే ఏడాది మార్చి వరకే సిద్ధమంది. ఒప్పందంపై చర్చలకు ఈ దఫా టీఎస్‌ఆర్టీసీ అధికారుల్ని విజయవాడకు రావాల్సిందిగా ఏపీఎస్‌ఆర్టీసీ ఆహ్వానించింది. ఈ అంశంపై సోమ లేదా మంగళవారాల్లో స్పష్టత రానుంది. తెలంగాణ డిమాండ్‌ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్ని, కి.మీ.లను తగ్గించి ప్రతిపాదనలు రూపొందించింది. 

కృష్ణా జిల్లా నుంచి అధికంగా బస్సుల తగ్గింపు
టీఎస్‌ఆర్టీసీ అధికారులు మొదట్నుంచీ హైదరాబాద్‌–విజయవాడ రూట్లోనే బస్సులు పెంచుకుంటామని చెబుతున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీని తగ్గించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచే 85 బస్సుల్ని తగ్గించింది. విజయవాడ రూట్లోనే టీఎస్‌ఆర్టీసీ సర్వీసులు పెంచుకోనుంది. టీఎస్‌ఆర్టీసీకి హైదరాబాద్‌–బెంగళూరు లాభదాయకమైన రూట్‌. రోజూ 70 సర్వీసుల వరకు బెంగళూరుకు తిప్పుతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి బస్సుల్ని తిప్పడం లేదు. ఎందుకంటే బెంగళూరుకు వెళ్లాలంటే ఏపీ నుంచే వెళ్లాలి. దీంతో ఇప్పుడు బస్టాండ్లలోకి రాకుండా బెంగళూరుకు బస్సుల్ని తిప్పుకుంటామని టీఎస్‌ఆర్టీసీ కోరుతోంది. దీనిపై ఏపీఎస్‌ఆర్టీసీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు