మానవ అక్రమ రవాణా తగ్గడం శుభపరిణామం

5 Sep, 2022 05:31 IST|Sakshi

ఏపీ ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయి 

జాతీయ నేర నివేదికపై హెల్ప్‌ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి రామమోహన్‌ విశ్లేషణ 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మానవ అక్రమ రవాణా తగ్గుముఖం పట్టడం శుభపరిణామం అని, గతేడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అనేందుకు ఇదే సంకేతమని హెల్ప్‌ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కార్యదర్శి రామమోహన్‌ నిమ్మరాజు స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్నేళ్లుగా కృషి చేస్తున్న రామమోహన్‌ జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ)–2021 నివేదికపై ఆదివారం స్పందించారు.

ఇందుకు సంబంధించిన సమీక్షను ‘సాక్షి’కి వెల్లడించారు. ప్రభుత్వం దిశ బిల్లుతో, ఇతర చర్యలతో రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణకు భరోసా ఇచ్చినట్లు అయిందన్నారు. గతేడాది ప్రతి జిల్లాకు ఒక మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్‌ (ఏహెచ్‌టీయూ) ఏర్పాటు చేసి అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవడం మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా మానవ అక్రమ రవాణా కేసుల్లో 2020లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 2021లో ఐదో స్థానానికి తగ్గిందన్నారు. ఎన్‌సీఆర్‌బీ రిపోర్టు ప్రకారం మానవ అక్రమ రవాణాలో మొదటి స్థానంలో తెలంగాణ, రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, అస్సాం, కేరళ ఉన్నాయన్నారు. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో 99.3 శాతం కేసుల్లో పోలీసులు చార్జిషీట్‌ వేయడం, 757 మందిని అరెస్టు చేయడం ఒక రికార్డు అని రామమోహన్‌ వివరించారు.  

మరిన్ని వార్తలు