AP: ఊరిలోనే రిజిస్ట్రేషన్‌

6 Jan, 2023 11:28 IST|Sakshi

తూర్పు గోదావరి జిల్లాలో భూ సమగ్ర సర్వే ప్రక్రియ పూర్తయిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు

33 సచివాలయాల ఎంపిక  రెండు సచివాలయాల్లో ఇప్పటికే ట్రయల్‌ రన్‌

గ్రామాల వారీగా ప్రజలకు అవగాహన

సాక్షి, రాజమహేంద్రవరం: గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. రిజిస్ట్రేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా తొలుత 51 గ్రామ, వార్డు సచివాలయాలను ఎంపిక చేసింది. ఎలాంటి భూ వివాదాలు లేని, సమగ్ర భూ సర్వే పూర్తయిన 33 సచివాలయాల పరిధిలోని గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. పైలెట్‌ ప్రాజెక్టుగా కొవ్వూరు నియోజకవర్గం తోగుమ్మి, రాజానగరం నియోజకవర్గం భూపాలపట్నం సచివాలయాల్లో సేవలను ఇప్పటికే ప్రారంభించింది. త్వరలో నిర్దేశించిన 31 సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.  

ఇప్పటి వరకు ఏం జరుగుతోందంటే.. 
స్థిర, చరాస్తులు, విక్రయాలు, కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిందే. ఈ క్రమంలో అక్కడున్న డాక్యుమెంట్‌ రైటర్లు, దళారులు నిర్ణయించిన ధర చెల్లించాల్సి వచ్చేది. లేని పక్షంలో డాక్యుమెంట్లు సక్రమంగా లేవంటూ కొర్రీలు పెట్టి వెనక్కు పంపుతున్న సంఘటనలు కోకొల్లలు. కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు దళారులతో కుమ్మక్కు కావడంతో అక్రమ తంతు యథేచ్ఛగా నడిచేది. అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందేలా చర్యలు తీసుకుంది. భూముల అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలన్నీ సచివాలయ కేంద్రంగానే చేపట్టేలా ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టింది. ప్రక్రియ సమర్థవంతంగా జరగాలంటే భూముల వివాదాలు ఉండకూడదని భావించింది. సమగ్ర భూ సర్వే పూర్తయిన గ్రామాల్లో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించి తొలుత  అలాంటి గ్రామాలను ఎంపిక చేసింది.

 

సిబ్బందికి అవగాహన

  •   రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై గ్రామ సచివాలయ సిబ్బందికి జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు ఇప్పటికే అవగాహన కల్పించారు. 
  •   ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి మరీ డాక్యుమెంట్ల పరిశీలన, చలానా తదితర విషయాలపై సమగ్రంగా సమాచారం అందించారు.  
  •    ఇది వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అందే సేవలన్నీ సచివాలయాలకు అనుసంధానం చేశారు.
  •   అక్నాలెడ్జ్‌మెంట్‌ అప్‌డేట్, డేటా ఫీడింగ్, చెక్‌స్లీప్, రెగ్యులర్‌ నంబర్‌ కేటాయింపు, ఫొటో, వేలిముద్రలు తీసుకోవడం, డాక్యుమెంట్‌ ప్రింటింగ్, స్కానింగ్, దస్తావేజు, సెటిల్‌మెంట్‌ దస్తావేజు, దాన విక్రయ, తనఖా, చెల్లు రశీదు, భాగ పరిష్కార రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, వివాహ రిజిస్ట్రేషన్‌ తదితర సేవలు ఉన్న ఊళ్లోనే అందుతాయి.  
  •  రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సచివాలయంలో ఒక పంచాయతీ సెక్రటరీకి ప్రభుత్వం జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ హోదా కల్పించింది.
  •    ఇకపై సచివాయలంలో జరిగే స్థిర, చరాస్తి క్రయ, విక్రయాల విక్రయం, కోనుగోలుపై పర్యవేక్షణ చేయాల్సి ఉంది. 

రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు
జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రెండు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రెండింటిలోనూ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొవ్వూరు నియోజకవర్గం తోగుమ్మిలో ఇప్పటి వరకు 101 రిజిస్ట్రేషన్లు జరిగ్గా వీటి విలువ రూ.26,58,522గా ఉంది. రాజానగరం నియోజకవర్గం భూపాలపట్నంలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. లేఅవుట్లు ఎక్కువగా ఉన్న కారణంతో భారీగా ఆదాయం సమకూరినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.16,96,53,581 విలువ చేసే 302 స్థిర, చరాస్తులు రిజిస్ట్రేషన్లు జరగ్గా.. రూ.73,23,939 ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.  

త్వరలో మరిన్ని గ్రామాల్లో..  
జిల్లాలో త్వరలో మరిన్ని గ్రామాల్లో సేవలు ప్రారంభం కానున్నాయి. అందులో నేలటూరు, నందిగంపాడు, జగన్నాథపురం, జగన్నాథపురం(గంగవరం), చిడిపి, తిమ్మరాజుపాలెం, బల్లిపాడు, పేరరామచంద్రపురం, అనపర్తి–5, కొప్పవరం, మహేంద్రవాడ–1, పోలమూరు–1, రామవరం–1, కుతుకులూరు–1, పెదపర్తి, పూలగుర్త, ఇల్లపల్లి, ఇల్లపల్లి(తుమ్మలాపల్లి), ఇల్లపల్లి(రాళ్లకండ్రిగ), కోమారిపాలెం–2, తొస్సిపూడి, పందలపాక–1,కొంకుదురూరు–1, దామిరెడ్డిపల్లి, బొమ్మూరు–2, రాజవోలు–1, శ్రీకృష్ణపట్నం, జి.ఎర్రవరం, నామవరం, సుభద్రంపేట, నార్త్‌ తిరుపతి రాజాపురం సచివాలయాల్లో త్వరలో సేవలు అందుబాటులోకి వస్తాయి.  

అవగాహన కల్పిస్తున్నాం 
రిజిస్ట్రేషన్‌ పక్రియపై సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం. స్థిరాస్తి క్రయ, విక్రయాలు, ఏ సేవకు ఎంత వసూలు చేయాలన్న విషయమై సమగ్రంగా చెబుతున్నాం. చలానాలు, ప్రభుత్వ ఫీజులు తీసుకోవాల్సిన వాటిపై చెబుతున్నాం. సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే ఎలా అధిగమించాలో స్పష్టం చేస్తున్నాం. తొలి విడతలో కేటాయించిన వాటిలో రిజిస్ట్రేషన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి. మిగిలిన వాటిలో సైతం పారదర్శకంగా జరిగేలా చూస్తాం.  
– ఆనందరావు, జిల్లా రిజిస్ట్రార్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ 

మరిన్ని వార్తలు