ఆక్సిజన్‌ సరఫరాపై నిత్యం పర్యవేక్షణ

12 May, 2021 04:16 IST|Sakshi

మూడు రాష్ట్రాలకు ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌లు

వీరు రెండు వారాల పాటు ఆక్సిజన్‌ ప్లాంట్లలోనే..

ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 22,395 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్‌  

సాక్షి, అమరావతి: వివిధ రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ను తీసుకురావడం, దాన్ని ఆస్పత్రులకు సరఫరా చేయడంపై ప్రతిక్షణం పర్యవేక్షణ చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో ఉన్న ప్లాంట్ల నుంచి వచ్చే ఆక్సిజన్‌ నిర్వహణకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు కలికాల వలవన్, అనంతరాములు, ఏకే పరిడాను నియమించామని తెలిపారు. నేటి నుంచి రెండు వారాల పాటు ఈ అధికారులు ఆయా ప్లాంట్లలోనే ఉండి పర్యవేక్షిస్తారన్నారు. మంగళవారం ఆయన ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయిస్తే మొత్తం కేటాయింపులను రాష్ట్రానికి తెచ్చామన్నారు.

ట్యాంకర్‌ జాప్యం కారణంగా తిరుపతిలో ఘటన జరిగిందని, దీనిపై పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందని తెలిపారు. మృతి చెందిన వారికి సీఎం జగన్‌ రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారన్నారు. ప్రతిరోజూ ఆక్సిజన్‌ వినియోగం పెరుగుతోందని, దీనికి తగ్గట్టు కేటాయింపులు జరపాలని కేంద్రాన్ని కోరుతున్నామని, సీఎం కూడా ప్రధానికి లేఖ రాశారని వివరించారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ప్రస్తుతం మైలాన్‌ కంపెనీ నుంచి కొంటున్నామని, అవి కాకుండా మరో 50 వేల ఇంజక్షన్లు వేరే కంపెనీ నుంచి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 22,395 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 104 కాల్‌ సెంటర్‌కు ఒక్కరోజులో 16వేలకు పైగా కాల్స్‌ వచ్చాయని చెప్పారు. హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న 9,796 మందికి ఫోన్‌ చేసి డాక్టర్లు సలహాలు ఇచ్చారని తెలిపారు. ఈ సంఖ్యను రోజుకు 15 వేలకు పెంచాలనే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్‌ సెంటర్లకు 100 చొప్పున స్లిప్పులు ఇస్తున్నామని, దీనిపై కలెక్టర్లు నిత్యం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.  

మరిన్ని వార్తలు