Andhra Pradesh: వర్షాలు తగ్గటమే ఆలస్యం..

1 Oct, 2021 02:31 IST|Sakshi

రూ.2,205 కోట్లతో 8,212 కి.మీ.రహదారుల పునరుద్ధరణ

రూ.6,400 కోట్లతో కొత్తగా 2,500 కి.మీ. రోడ్ల నిర్మాణం

మే నెలలోనే ప్రణాళిక... జూన్‌లో టెండర్ల ప్రక్రియ

నిధుల సమీకరణకు సీఎం జగన్‌ ప్రత్యేక చొరవ.. సెప్టెంబర్‌ 6న సమీక్షించి కార్యాచరణ నిర్దేశం

వచ్చే వేసవి నాటికి పనులు పూర్తయ్యేలా పక్కా ప్రణాళిక

ప్రజల్ని వంచించేందుకు రోడ్డునపడ్డ టీడీపీ, జనసేన

రూ.3 వేల కోట్ల బ్యాంకు రుణాన్ని పసుపు–కుంకుమకు మళ్లించిన బాబు

అధికారంలో ఉండగా రోడ్లపై అలక్ష్యం.. నిర్వహణ గాలికి

ఉనికి కోసం విపక్షాల ‘రాంగ్‌ రూట్‌’

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ‘రోడ్‌ మ్యాప్‌’తో దూసుకెళ్తుండగా... ప్రతిపక్ష టీడీపీ, జనసేన రాజకీయ ఉనికి కోసం ‘రాంగ్‌ రూట్‌’లో ప్రయాణిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్కన ఇప్పటికే రోడ్ల పునరుద్ధరణ, కొత్త రహదారుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టిన తరువాత కూడా ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, శ్రమదానాల పేరుతో తమ అనుకూల మీడియా, సోషల్‌ మీడియా ద్వారా బురద జల్లేందుకు ప్రయత్నిస్తుండటం పట్ల తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి బాటలో నిబ్బరంగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఇక ఇతర అంశాలేవీ లేకపోవడంతో ఆందోళనల పేరుతో ప్రజల్ని మోసగించేందుకు విపక్షాలు దుష్ప్రచారానికి తెర తీసినట్లు స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రారంభించి వరుసగా పంచాయతీ, మున్సిపల్, పరిషత్‌ ఎన్నికలు, అంతకుముందు తిరుపతి ఉప ఎన్నికలో ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో దిక్కుతోచని విపక్షాలు ‘రోడ్డు’న పడినట్లు వెల్లడవుతోంది. చంద్రబాబు నాయకత్వం పట్ల టీడీపీ శ్రేణులే సందేహంలో పడగా... జనసేనను ఓ రాజకీయ పార్టీగా కూడా ప్రజలు గుర్తించకపోవడంతో ఇలాంటి ఎత్తుగడలకు దారి తీసినట్లు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్నెళ్ల క్రితమే రోడ్ల పునరుద్ధరణ, కొత్త రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించిందని, టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. 

స్పష్టంగా రోడ్‌ మ్యాప్‌ 
సెప్టెంబర్‌ 6వ తేదీన నిర్వహించిన సమీక్షలో రహదారులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ నిర్దేశించారు. వర్షాలు తగ్గగానే వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. నిధుల సేకరణకు కూడా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని తగిన ఏర్పాట్లు చేశారు. వచ్చే ఏడాది వేసవి నాటికి రోడ్ల పునరుద్ధరణతోపాటు కొత్త రోడ్ల నిర్మాణం పూర్తవుతుంది. విపక్షాలు ఎన్ని డ్రామాలాడినా వచ్చే వేసవి నాటికి రాష్ట్రంలో రోడ్లన్నీ తళతళలాడతాయి. తీరైన రోడ్లపై హాయైన ప్రయాణానికి మార్గం సుగమమవుతుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా రోడ్లను గాలికి వదిలేసి చివరి రెండేళ్లు ఏమాత్రం పట్టించుకోకుండా అలక్ష్యం వహించారు. అంతేకాదు.. రోడ్ల కోసం బ్యాంకు నుంచి తెచ్చిన రూ.3 వేల కోట్ల రుణాలను ‘పసుపు–కుంకుమ’ పేరుతో వెదజల్లి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. 

మే నెలలోనే ప్రణాళిక.. జూన్‌లో టెండర్లు
రూ.2,205 కోట్లతో రహదారుల పునరుద్ధరణ, రూ.6,400 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌ మే నెలలోనే ప్రణాళిక ఖరారు చేయడంతో ప్రభుత్వం జూన్‌లో టెండర్ల ప్రక్రియ చేపట్టింది. నిధుల సమీకరణ యత్నాలను విజయవంతంగా పూర్తి చేసి వర్షాలు తగ్గగానే పనులు ప్రారంభించి వచ్చే వేసవి నాటికి పూర్తి చేసేలా కార్యాచరణను వేగవంతం చేసింది.  

ఇబ్బందులున్నా వెనకడుగు లేదు..
రోడ్లు, సముద్ర మార్గం, ఎయిర్‌ కనెక్టివిటీలను చుక్కానిగా చేసుకుని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధృఢ సంకల్పం. ప్రధానంగా 2014 – 19 వరకు టీడీపీ హయాంలో రోడ్ల నిర్వహణను విస్మరించడం, అధికారంలో ఉన్న చివరి రెండేళ్ల పాటు పూర్తిగా గాలికొదిలేయడంతో పరిస్థితి జఠిలంగా మారిందని గుర్తించారు.

ఈ నేపథ్యంలో రహదారులకు సీఎం జగన్‌ అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. 2020లో కోవిడ్‌ వల్ల దేశవ్యాప్తంగా నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 2021 ప్రారంభంలో కూడా కోవిడ్‌ రెండోవేవ్‌తో దేశం తీవ్రంగా సతమతమైంది. కోవిడ్‌ ప్రభావంతో ఆదాయం క్షీణించి రాష్ట్రం నిధులు సమస్య ఎదుర్కోవాల్సి వచ్చినా రోడ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్‌ వెనుకంజ వేయలేదు. ఆర్నెళ్ల క్రితమే ఈ ఏడాది మే నెలలోనే ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి రోడ్ల పునరుద్ధరణ, కొత్త రహదారుల నిర్మాణంపై ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రంలో రూ.2,205 కోట్లతో రోడ్ల పునరుద్ధరణ, రూ.6,400 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణ ప్రణాళికలను ఆమోదించారు. ఈ క్రమంలో ఆర్‌ అండ్‌ బీ శాఖ జూన్‌లోనే టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టింది.

నిధుల సేకరణకు సీఎం ప్రత్యేక చొరవ
ప్రణాళిక మాత్రమే కాదు... రోడ్ల నిర్మాణానికి నిధుల సేకరణ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. కౌంటర్‌ గ్యారంటీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సమ్మతించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో రోడ్ల పునరుద్ధరణ కోసం రూ.2 వేల కోట్ల రుణం మంజూరు చేసేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అంగీకరించింది. ఇక మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి కొత్త రహదారుల కోసం రూ.6,400 కోట్ల రుణం అందచేసేలా ‘న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఎన్‌డీబీ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా రోడ్ల నిర్మాణానికే వెచ్చించేందుకు ‘ప్రత్యేక ఫండ్‌ అకౌంట్‌’ తెరవాలని నిర్ణయించడం గమనార్హం. ఆ ఖాతా నుంచి నేరుగా కాంట్రాక్టు సంస్థలకు బిల్లులు చెల్లిస్తారు. దీంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరగదని కాంట్రాక్టు సంస్థలకు పూర్తి భరోసా కలుగుతుంది. ఇలా నిధుల సమస్య తీరిపోవడంతో సెప్టెంబర్‌  6వతేదీన ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా రహదారుల అంశంపై సీఎం వైఎస్‌ జగన్‌ చర్చించారు. వర్షాలు తగ్గగానే వెంటనే పనులు ప్రారంభించి వచ్చే ఏడాది వేసవి నాటికి పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు.  

8,212 కి.మీ. రోడ్ల పునరుద్ధరణకు బిడ్లు
రాష్ట్రంలో గుంతలు పడ్డ రోడ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. మొత్తం 8,212 కి.మీ. మేర రోడ్ల పునరుద్ధరణకు 1,140 పనులను గుర్తించింది. అందుకోసం రూ.2,205 కోట్లతో ప్రణాళికను ఆమోదించి జూన్‌లోనే టెండర్ల ప్రక్రియ చేపట్టింది. వాటిలో ఇప్పటికే దాదాపు రూ.597.13 కోట్ల విలువైన 322 పనులకు బిడ్లు దాఖలు చేశారు. మిగిలిన రూ.1,607.87 కోట్ల పనులకు బిడ్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. నెలరోజుల్లో అన్ని పనులకు టెండర్లు ఖరారు చేసి నవంబరులో పనులు ప్రారంభించాలని ఆర్‌ అండ్‌ బి శాఖ భావిస్తోంది. వచ్చే ఏడాది మే నాటికి పనులు పూర్తి చేస్తారు. 

రూ.6,400 కోట్లతో 2,500 కి.మీ. కొత్త రోడ్లు
2010 నుంచి 2019 వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త రోడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ప్రధానంగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఒక మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి రోడ్ల నిర్మాణాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ సమస్య పరిష్కరించి గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రోడ్డు వసతి కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు.

అందుకోసం ఏకంగా రూ.6,400 కోట్లతో 2,500 కి.మీ. మేర కొత్త రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. మొదటి దశలో రూ.3,014 కోట్లతో 1,244 కి.మీ. మేర రోడ్లు నిర్మిస్తారు. దీనికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వడంతో మొత్తం 124 పనులకు టెండర్లు కూడా ఖరారు చేసి పనులు ప్రారంభించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.85.43 కోట్ల ప్రజాధనాన్ని కూడా ఆదా చేశారు. వర్షాలు తగ్గిన వెంటనే ఈ పనులను వేగవంతం చేస్తారు. ఇక రెండో దశలో రూ.3,386 కోట్లతో 1,256 కి.మీ. మేర కొత్త రోడ్ల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) పూర్తి కావచ్చింది. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపడతారు. డిసెంబరులో పనులు ప్రారంభించి వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేస్తారు. 

రూ.3 వేల కోట్ల రుణం.. ‘పసుపు –కుంకుమ’ పాలు
టీడీపీ హయాంలో 2018లో రోడ్ల నిర్మాణం కోసం తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించారు. ఫలితంగా చాలా చోట్ల రహదారులు అధ్వాన్నంగా మారాయి. చివరి రెండేళ్ల పాటు రాష్ట్రంలోని రోడ్లను గత సర్కారు పట్టించుకోకపోవడంతో దారుణంగా తయారయ్యాయి. 

నిర్వహణపై బాబు సర్కారు మొద్దునిద్ర
చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు రోడ్ల మరమ్మతుల అంశాన్ని గాలికొదిలేసింది. నిధులు కేటాయింపుల్లో హడావుడి చేసి విడుదల చేసే విషయంలో మాత్రం ముఖం చాటేసింది. ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మతులు సరిగా చేపట్టకపోవడంతో సమస్య సంక్లిష్టంగా మారింది. రోడ్లన్నీ గుంతలమయంగా మారి వాటిపై ప్రయాణం అంటేనే బెంబేలెత్తాల్సిన దుస్థితి ఏర్పడింది. 

మరిన్ని వార్తలు