Andhra Pradesh: ఇళ్ల పథకంలో జోక్యానికి ఎన్‌జీటీ ‘నో’ 

4 Sep, 2022 03:37 IST|Sakshi

5,200 ఇళ్ల పట్టాల మంజూరుపై దాఖలైన పిటిషన్‌ తిరస్కరణ 

కుందు నది పరిరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది 

ఆ నదిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆరోపణలకు ఆధారాల్లేవు 

ప్రభుత్వ చర్యలు పిటిషనర్‌ అనుమానాలను నివృత్తి చేసేలా ఉన్నాయి 

ఆ భూమిని ఇళ్ల స్థలాలకు ఇవ్వాలా? లేదా? అన్న అంశం జోలికి మేం వెళ్లం 

బఫర్‌జోన్‌లో మాత్రం నిర్మాణాలు చేపట్టొద్దు.. వ్యర్థాలను నదిలో కలపొద్దు  

తేల్చిచెప్పిన జాతీయ హరిత ట్రిబ్యునల్‌.. ఈ తీర్పుతో టీడీపీ కుట్రలు పటాపంచలు  

సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం విషయంలో జోక్యానికి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) తిరస్కరించింది. ఈ పథకం కింద నంద్యాల జిల్లాలో 5,200 ఇళ్ల పట్టాల మంజూరువల్ల పర్యావరణపరంగా కుందు నది తీవ్రంగా ప్రభావితమవుతుందంటూ దాఖలైన పిటిషన్‌ను హరిత ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. కుందు నది పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని ఎన్‌జీటీ స్పష్టంచేసింది.

పేదల ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు టీడీపీ చేసిన కుట్రలు ట్రిబ్యునల్‌ తీర్పుతో పటాపంచలయ్యాయి. మరోవైపు.. ఇళ్ల స్థలాల మంజూరువల్ల పర్యవరణంగా కుందు నదిపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయంటూ పిటిషనర్‌ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని ఎన్‌జీటీ తెలిపింది. 5,200 ఇళ్ల స్థలాల మంజూరుకు ఉద్దేశించిన 145.61 ఎకరాల భూమిని పేదలందరికీ ఇళ్ల పథకం కోసం ఉపయోగించవచ్చా? లేదా? అన్న విషయం జోలికి కూడా తాము వెళ్లబోవడంలేదని ఎన్‌జీటీ తేల్చిచెప్పింది.

ఆ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఆ భూముల విషయంలో తాము ఏ రకంగానూ జోక్యం చేసుకోవడంలేదని వివరించింది. ఇరువైపులా బఫర్‌జోన్‌ ఏర్పాటుచేసి కుందు నది బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపట్ల సంతృప్తి వ్యక్తంచేసింది. నది ప్రవాహ ఎగువ, దిగువ ప్రాంతాల్లో శాస్త్రీయ ప్రాతిపదికన ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యలు వరద విషయంలో పిటిషనర్‌ వ్యక్తంచేసిన అనుమానాలన్నింటినీ నివృత్తి చేసేలా ఉన్నాయని స్పష్టంచేసింది.

అయితే, కుందు నదికి ఇరువైపులా ఏర్పాటుచేసిన బఫర్‌ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని తెలిపింది. ఒకవేళ హైకోర్టు ఆ 145 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించడాన్ని సమర్థించినప్పటికీ, పేదలందరికీ ఇళ్ల పథకం ప్రాజెక్టు అమలు విషయంలో పర్యావరణ చట్టాలను తూచా తప్పకుండా అమలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పాటించాలని, కుందు నదిలో గానీ, బఫర్‌ జోన్‌ ప్రాంతంలోగానీ వదలడానికి, వీల్లేదని ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌జీటీ జ్యుడీషియల్‌ మెంబర్‌ జస్టిస్‌ కె. రామకృష్ణన్, ఎక్స్‌పర్ట్‌ మెంబర్‌ కొర్లపాటి సత్యగోపాల్‌ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.  

ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల ఇబ్బంది లేదు 
కుందు నది విస్తరణ నిమిత్తం నంద్యాల మండలం, మూలసాగరం పరిధిలో ప్రభుత్వం 2013లో 209.5 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో కొంతభాగాన్ని బఫర్‌ జోన్‌కు కేటాయించింది. మిగిలిన 145 ఎకరాల భూమిలో పేదలకు 5,200 ఇళ్ల పట్టాలు మంజూరుచేయాలని నిర్ణయించింది. దీన్ని సవాల్‌ చేస్తూ నంద్యాల సంజీవ్‌నగర్‌కు చెందిన షేక్‌ నూమాన్‌ బాషా పేరుతో ఎన్‌జీటీలో ఫిర్యాదు నమోదైంది.

ఆ 145 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తే వర్షాకాలంలో నంద్యాల ప్రజలు వరదను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎన్‌జీటీ ప్రభుత్వ వివరణ కోరింది. అలాగే, క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఇళ్ల స్థలాల కేటాయింపువల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదంటూ కమిటీ నివేదిక ఇచ్చింది.   

సర్కారు అన్ని జాగ్రత్తలూ తీసుకుంది 
ఇక ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కుందు నది పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. నదికి ఇరువైపులా బలోపేతం చేసేందుకు నిర్మాణ పనులను సైతం ప్రారంభించిందన్నారు. తగినంత భూమిని బఫర్‌ జోన్‌ కింద విడిచిపెట్టి మిగిలిన భూమినే ఇళ్ల స్థలాల మంజూరు కోసం వినియోగిస్తున్నామన్నారు.

అదనపు ఏజీ వాదనలతో ఏకీభవించిన ఎన్‌జీటీ ధర్మాసనం ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల కుందు నదిపై పర్యావరణపరంగా ఎలాంటి ప్రభావం ఉంటుందన్న అంశానికే తాము పరిమితమవుతున్నట్లు తెలిపింది.   

మరిన్ని వార్తలు