జేఈఈలో నిబంధనల సడలింపు

10 Feb, 2021 03:42 IST|Sakshi

కరోనా నేపథ్యంలో గత ఏడాది సడలింపులు ఈ ఏడాదికీ వర్తింపు

జేఈఈ అడ్వాన్సుకు ఇంటర్‌ పాస్‌ అయితే చాలు

ఈనెల 23 నుంచి జేఈఈ మెయిన్స్‌ 

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ)లో అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనలను సడలించింది. ఈ మేరకు మంగళవారం ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అధికారిక నోట్‌ను పొందుపరిచింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది అర్హత విషయంలో మినహాయింపులిచ్చింది. ఈ ఏడాది కూడా వాటిని కొనసాగించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. జేఈఈకి హాజరయ్యే అభ్యర్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశం పొందాలంటే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌లో మెరిట్‌ ఉండడంతో పాటు వారికి ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండడం లేదా టాప్‌ 20 పర్సంటైల్‌ వచ్చి ఉండాలన్న నిబంధన ఉంది. అలా ఇంటర్‌లో 75 శాతం మార్కులు, లేదా టాప్‌ 20 పర్సంటైల్‌లు ఉండే వారికి మాత్రమే జేఈఈ అడ్వాన్సుకు అనుమతిస్తారు.

అందులో మెరిట్‌ సాధించిన వారికి ఐఐటీ ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కానీ, కరోనావల్ల గత విద్యా సంవత్సరం అనేక రాష్ట్రాలు ఇంటర్‌ పరీక్షలను నిర్వహించలేకపోయాయి. దీంతో ఆయా బోర్డులు విద్యార్థులను ఆల్‌పాస్‌గా ప్రకటించాయి. అలాగే, కరోనావల్ల ఏర్పడిన ఈ ప్రత్యేక పరిస్థితుల్లో జేఈఈలో కూడా విద్యార్థులకు 75 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నట్లు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో కూడా తమకు ఇంటర్‌లో 75 శాతం మార్కుల నుంచి మినహాయింపునివ్వాలని దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వినతులు వస్తుండడంతో కేంద్రం స్పందించింది. అర్హత విషయంలో గత ఏడాది ఇచ్చిన మినహాయింపులను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఏ ప్రత్యేక నోటీసును వెబ్‌సైట్లో పొందుపరిచింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు 75శాతం మార్కులతో సంబంధం లేకుండా ఉత్తీర్ణత సాధిస్తే చాలని పేర్కొంది.

మెయిన్స్‌కు 20 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు
ఇదిలా ఉంటే.. జేఈఈ మెయిన్స్‌ తొలివిడత ఆన్‌లైన్‌ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు 26 వరకు కొనసాగుతాయి. ఈ ప్రవేశ పరీక్షను ఇంగ్లీషు, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇందుకు రాష్ట్రంలోని 20 నగరాల్లో ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. అవి.. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం.  

మరిన్ని వార్తలు