రైతుకు రొక్కం.. సాగుకు ఊతం

12 May, 2021 04:52 IST|Sakshi

13న మొదటి విడత రైతు భరోసా నిధులు విడుదల

గుంటూరు జిల్లాలో 4,63,745 మంది రైతులకు చేకూరనున్న లబ్ధి

రైతుల ఖాతాల్లో జమయ్యే నగదు రూ.349.01 కోట్లు

గతేడాదితో పోల్చితే 6030 మంది రైతులకు అదనంగా లబ్ధి

కరోనా విపత్తు వేళ రైతుకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

కరోనా ఉధృతి కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో తొలివిడత నగదును జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఇప్పటికే అర్హుల జాబితాలు రైతు భరోసా కేంద్రాలకు చేరాయి. ఆపద వేళ ప్రభుత్వం అండగా నిలవడం రైతుల్లో ఆనందం నింపింది.

సాక్షి, అమరావతి బ్యూరో: రైతులకు పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం’ అమలు చేస్తోంది. ఖరీఫ్‌లో పంట పెట్టుబడుల కోసం ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తోంది. ఈ నెల 13వ తేదీన మొదటి విడత సొమ్ము రూ.7500 చొప్పున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా విడుదల చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించి అర్హులైన రైతుల జాబితాలు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలకు చేరాయి. లబ్ధిదారుల జాబితాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు. 2019–20 సంవత్సరం నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తున్నారు. మొదటి విడత మేలో రూ.7500, రెండో విడత అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడత జనవరిలో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గత ఏడాది మూడు విడతల్లో 4,77,830 మంది రైతుల ఖాతాల్లో రూ.645.07 కోట్ల నగదు జమ చేశారు. లబ్ధిదారుల్లో 13,545 మంది ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన గిరిజన రైతులు ఉన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 6030 మంది రైతులకు అదనంగా లబ్ధి కలుగుతోంది. ఈ ఏడాది మొత్తం 4,63,745 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. వారిలో 1604 ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన గిరిజన రైతులు ఉన్నారు.  

రైతుభరోసా కేంద్రాల ద్వారా...
సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయం, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పేర్ల నమోదు ఇలా ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా చేపట్టింది. రైతుల ముంగిటకే అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. పంట బీమా, పంట నష్ట పరిహారం, పంటల నమోదు వంటి ప్రక్రియ సాగుతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం వరి ధాన్యం, మొక్క జొన్న, జొన్న వంటి పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోంది. వచ్చే ఖరీఫ్‌కు సంబంధించి పచ్చిరొట్ట ఎరువులు, పత్తి, మిరప విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

ఆనందంగా ఉంది
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. గత ఏడాది వరి సాగులో మంచి దిగుబడులు వచ్చాయి. మద్దతు ధరకే ధాన్యం విక్రయించా. ప్రస్తుత కరోనా కష్ట కాలంలో సైతం రైతు భరోసా మొదటి విడత సొమ్మును జమచేయాలని నిర్ణయించడంతో ఆనందంగా ఉంది. నాకు రెండు ఎకరాల పొలం ఉంది. సొమ్ము ఖరీఫ్‌లో పత్తి, వరి సాగుకు అక్కరకొస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు.
– సంగటి చెన్నారెడ్డి, లక్ష్మీపురం, కారంపూడి మండలం, గుంటూరు జిల్లా 

అర్హుల జాబితాలు సిద్ధం
‘వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకం కింద మొదటి విడత నగదు పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అర్హులైన రైతుల పేర్లతో జాబితాలు సిద్ధమయ్యాయి. ఈ జాబితాలు వ్యవసాయశాఖ సహాయకులు రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. అర్హుల పేర్లు జాబితాల్లో లేకపోతే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫిర్యాదులను పరిష్కరించి అర్హులందరికీ లబ్ధిచేకూరుస్తాం. 
– విజయభారతి, వ్యవసాయసంయుక్త సంచాలకులు  

మరిన్ని వార్తలు