ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం విడుదల

11 Aug, 2021 03:48 IST|Sakshi

ఇకపై ప్రతి నెలా గౌరవ వేతనం జమ చేసేలా చర్యలు: ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా 

కడప కార్పొరేషన్‌: ఆంధ్రప్రదేశ్‌లోని ఇమామ్‌లు, మౌజన్లకు మే, జూన్, జూలై మాసాలకు సంబంధించిన గౌరవ వేతనం విడుదల చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇమామ్‌లకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు, మౌజన్లకు నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచిన గౌరవ వేతనం ప్రకారం మే, జూన్‌ మాసాలకు గాను రూ.14.74 కోట్లు మసీదుల కమిటీల జాయింట్‌ అకౌంట్లలో జమ చేశామన్నారు. అలాగే, జూలై నెలకు సంబంధించిన గౌరవ వేతనం రూ.7.98 కోట్లు కూడా జమ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇకపై ఇమామ్‌లు, మౌజన్లకు ప్రతి నెలా గౌరవ వేతనం జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అంజాద్‌ బాషా తెలిపారు. విడుదలయ్యే మొత్తాలను మసీదు కమిటీలు ఇమామ్‌లు, మౌజన్లకు ప్రతినెలా కచ్చితంగా చెల్లించాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు