హైకోర్టులో ఆ ఐఏఎస్‌లకు ఊరట

29 Apr, 2022 03:52 IST|Sakshi

సామాజిక సేవ చేయాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల అమలు ఎనిమిది వారాలపాటు నిలుపుదల 

తదుపరి విచారణ జూన్‌ 20కి వాయిదా 

సాక్షి, అమరావతి: ఐఏఎస్‌ అధికారులు వై. శ్రీలక్ష్మీ, బి. రాజశేఖర్, చినవీరభద్రుడు, జె. శ్యామలరావు, జి. విజయ్‌కుమార్, ఎంఎం నాయక్‌లకు రాష్ట్ర హైకోర్టు ఊరటనిచ్చింది. ఏదైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహంలో నెలలో ఓ ఆదివారం చొప్పున 12 ఆదివారాలు సామాజిక సేవ చేయాలంటూ సింగిల్‌ జడ్జి విధించిన శిక్షను హైకోర్టు ధర్మాసనం ఎనిమిది వారాలపాటు నిలిపివేసింది. తదుపరి విచారణను జూన్‌ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ తర్లాడ రాజశేఖర్‌ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 

సామాజిక సేవకు ఐఏఎస్‌ల అంగీకారం 
ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణాలను తొలగించాలన్న ఆదేశాలను సకాలంలో అమలుచేయకపోవడాన్ని సింగిల్‌ జడ్జి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ కోర్టు ధిక్కారంగా పరిగణించారు. ఇందుకు పంచాయతీరాజ్‌ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్‌ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, అప్పటి కమిషనర్‌ చిన వీరభద్రుడు, పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, ఆ శాఖ ప్రస్తుత స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై. శ్రీలక్ష్మీ, ఆ శాఖ అప్పటి డైరెక్టర్‌ జి. విజయ్‌కుమార్, ప్రస్తుత డైరెక్టర్‌ ఎంఎం నాయక్‌లను బాధ్యులుగా చేశారు.

కోర్టు ధిక్కారం కింద వారికి నెలరోజుల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించారు. అయితే.. వారు క్షమాపణ కోరడంతో పాటు వారి అభ్యర్థన మేరకు ఆ శిక్షను సామాజిక సేవగా మార్చారు. ఈ తీర్పును పునః సమీక్షించాలంటూ శ్రీలక్ష్మీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ కొట్టేశారు. దీంతో సామాజిక సేవ చేయాలన్న తీర్పును సవాలు చేస్తూ ద్వివేదీ, గిరిజా శంకర్‌లు ఇటీవల ధర్మాసనం ముందు వేర్వేరుగా రెండు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై గత వారం విచారణ జరిపిన సీజే ధర్మాసనం, గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్‌లకు విధించిన సామాజిక సేవ శిక్ష అమలును నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.  

ఆరుగురు ఐఏఎస్‌ అధికారుల అప్పీళ్లు 
ఈ నేపథ్యంలో.. మిగిలిన ఐఏఎస్‌ అధికారులు కూడా సింగిల్‌ జడ్జి తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం జస్టిస్‌ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపింది. ఐఏఎస్‌ అధికారుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, కోర్టు ధిక్కారానికి పాల్పడిన వారికి ఎలాంటి శిక్ష విధించాలో, ఎంత కాలపరిమితితో విధించాలో కోర్టు ధిక్కార చట్టంలో స్పష్టంగా ఉందని వివరించారు. ఇదే వ్యవహారంలో సీజే ధర్మాసనం ఉత్తర్వులను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో శ్రీలక్ష్మీ తదితరులు దాఖలు చేసిన ఈ అప్పీళ్లలో కూడా సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.    

మరిన్ని వార్తలు