Cyclone Gulab: అప్రమత్తం.. 1358 మందికి పునరావాసం

26 Sep, 2021 22:16 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా గులాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్నిరకాల సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. తుపాను ప్రభావిత మండలాలైన 13 మండలాల్లో 61 కేంద్రాలను ఏర్పాటు చేసామని చెప్పారు. ఇప్పటికే 38 పునరావాస కేంద్రాల్లోకి 1358 మందిని తరలించి, వారికి వైద్యం, భోజనం, ఇతర ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. గార మండలంలోని ఎస్.మత్స్యలేశం, మొగదల పాడు, నగిరెడ్లపేట తుపాను సురక్షిత కేంద్రాలతో పాటు బందరువానిపేట జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 500 మందికి పునరావాసం కల్పించామని అన్నారు.

కవిటి మండలంలోని కుసుమపురం, మాణిక్యపురం, ఎద్దువాణిపాలెం, కవిటి.. ముత్యాలపేట తుపాను సురక్షిత కేంద్రాల్లో 342 మందికి, వజ్రపు కొత్తూరులోని హుకుంపేట, మంచినీళ్లపేట, కె.ఆర్.పేట, బైపల్లి, మెట్టూరు మరియు వజ్రపు కొత్తూరు తుఫాన్ రక్షిత కేంద్రాల్లోకి 182 మందికి ఇప్పటివరకు తరలించామన్నారు. ఇచ్చాపురం మండలంలో డొంకూరు, ఈదుపురం తుపాను రక్షిత కేంద్రాలతో పాటు డొంకూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 100 మందికి, సంతబొమ్మాళి మండలంలో ఆర్.సున్నపల్లి తుపాను రక్షిత కేంద్రంలో 100 మందికి, పోలాకిలోని గుప్పిడిపేట, రాజారాంపురం పునరావాస కేంద్రాల్లోకి 54 మందిని తరలించినట్లు కలెక్టర్ చెప్పారు.

కంచిలి మండలంలోని కుట్టుమ పునరావాస కేంద్రానికి 30 మందికి, పలాస మండలంలోని అమలకుడియా, సరియాపల్లి, బొడ్డపాడు, రంగోయి కేంద్రాలకు 30 మందికి, సోంపేట మండలంలోని బారువ పునరావాస కేంద్రానికి 20 మందిని మొత్తం 1,358 మందికి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ చెప్పారు. గులాబ్ తుపాన్ ప్రభావంతో వీచిన బలమైన గాలులకు కంచిలి మండలంలోని మద్దిపుట్టుగ గ్రామంలో 2 ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోగా వాటిని తక్షణమే అధికారులు మరమ్మతులు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సోంపేట మండలంలోని మాకన్నపురంలో ఒక ఇల్లు, కాశీబుగ్గ హరిజన వీధిలో ఒక ఎలక్ట్రికల్ పోల్ విరిగినట్లు ఇప్పటివరకు అందిన సమాచారమని కలెక్టర్ తెలిపారు. పలుచోట్ల  రహదారులకు అడ్డంగా విరిగిన చెట్లను తక్షణమే చెట్లను తొలగించడం జరుగుతుందని చెప్పారు. ఇంకా మిగిలిన ప్రాంతాల నుండి నష్టపోయిన వివరాలు అందాల్సి ఉందని కలెక్టర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు