ఉల్లి విక్రయాలకు తొలగిన అడ్డంకి

10 Oct, 2021 04:56 IST|Sakshi
మార్కెట్‌ యార్డులో పర్యటిస్తున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి

దిగివచ్చిన కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు.. ఈ–నామ్‌కు ఆమోదం

రేపటి నుంచి ఉల్లి సహా అన్ని రకాల పంటల క్రయవిక్రయాలు

కర్నూలు (అగ్రికల్చర్‌): కర్నూలు మార్కెట్‌ యార్డులో ఉల్లి క్రయవిక్రయాల్లో గత నెల 17 నుంచి నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. యార్డులో నెలకొన్న సమస్యలు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చొరవతో పరిష్కారమయ్యాయి. మార్కెట్‌కు ఉల్లిగడ్డలు తెప్పించేందుకు, ఈ–నామ్‌ అమలుకు కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు అంగీకరించారు. దీంతో ఈ నెల 11 నుంచి కర్నూలు మార్కెట్‌ యార్డులో ఉల్లి సహా అన్ని రకాల పంటల కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయి. కొత్తగా మినుములు, కొర్రలను కూడా కొనుగోలు చేసే సదుపాయాన్ని మార్కెట్‌ కమిటీ కల్పించింది. శనివారం ఉదయం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులతో సమావేశమయ్యారు.

ఉల్లి క్రయవిక్రయాల్లో మరింత పారదర్శకతను పెంపొందించేందుకు, వ్యాపారుల మధ్య పోటీ ఉండటం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం ఉల్లికి కూడా ఈ–నామ్‌ అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు విధిగా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సహకరించకపోతే కొత్త కమీషన్‌ ఏజెంట్లు, కొత్త వ్యాపారులను రంగంలోకి దింపి ఉల్లి సహా అన్ని పంటలను ఈ–నామ్‌లో కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో దిగివచ్చిన కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు ఈ నెల 11 నుంచి తాము కూడా ఈ–నామ్‌లో కొంటామని సంసిద్ధత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి, కమీషన్‌ ఏజెంట్ల సంఘం నేతలు కట్టా శేఖర్, శ్రీనివాసరెడ్డి, జూటూరు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు