సివిల్‌ జడ్జి నియామకాల్లో రూల్‌ 6 (ఎఫ్‌) రద్దు

24 Sep, 2021 02:25 IST|Sakshi

పిటిషనర్‌కు జేసీజే పోస్టు ఇవ్వాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: జూనియర్‌ సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) పోస్టుల భర్తీ ప్రక్రియలో ఓసీ అభ్యర్థులతో సమానంగా బీసీ అభ్యర్థులు కూడా రాత పరీక్ష, వైవాలో కలిపి మొత్తం 60 శాతం మార్కులు సాధించాలన్న ఏపీ జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ రూల్స్‌లోని రూల్‌ 6 (ఎఫ్‌)ను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఈ నిబంధనకు అనుగుణంగా జూనియర్‌ సివిల్‌ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీ నిమిత్తం 2019లో హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఓసీ, బీసీ అభ్యర్థులు రాత పరీక్ష, వైవాలో 60 శాతం మార్కులు సాధించాలంటూ పెట్టిన క్లాజ్‌ 8ను కొట్టేసింది. ఈ నిబంధన చట్టవిరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ నిబంధన వల్ల బీసీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న పిటిషనర్‌ వాదనతో ఏకీభవించింది. ఈ నిబంధన వల్ల నష్టపోయిన పిటిషనర్‌ షేక్‌ నిషాద్‌ నాజ్‌కు జేసీజే పోస్టు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఓసీ అభ్యర్థులతో సమానంగా బీసీ అభ్యర్థులు రాత పరీక్ష, వైవా కలిపి 210 మార్కులు సాధించాలన్న నిబంధనను రాజ్యాంగ విరుద్ధంగా, ఏపీ జ్యుడిషియల్‌ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించి కొట్టేయాలని కోరుతూ గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన షేక్‌ నిషాద్‌ నాజ్‌ గతేడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది బాలాజీ వాదనలు వినిపిస్తూ.. జేసీజే పోస్టుల నోటిఫికేషన్‌లో ఇంటర్వ్యూలకు ఎంపిక కావాలంటే ఓసీ అభ్యర్థులు రాత పరీక్షలో 300 మార్కులకు గాను 180, వైవాలో 50 మార్కులకు గాను 30 మార్కులు కలిపి మొత్తం 210 మార్కులు సాధించాలని పేర్కొందన్నారు. అలాగే బీసీ అభ్యర్థులు రాత పరీక్షలో 165, వైవాలో 45 మార్కులు కలిపి మొత్తం 210 మార్కులు సాధించాలని నిబంధన విధించిందన్నారు. ఒక్కో పేపర్‌లో సగటున 50 మార్కులు సాధించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక్కడే బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. వైవాలో బీసీ అభ్యర్థులు ఏకంగా 95 శాతం మార్కులు సాధిస్తే తప్ప మొత్తం 210 మార్కులు సాధించడం సాధ్యం కాదని వివరించారు.    

మరిన్ని వార్తలు